close

తాజా వార్తలు

Published : 23/11/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాతబస్తీని భాగ్యనగరం చేస్తాం:బండి సంజయ్‌

హైదరాబాద్‌: భాజపా అంటే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దేశాన్ని మజ్లిస్‌కు అప్పజెప్పేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెరాస మద్దతిస్తోందని విమర్శించారు. తెరాస, మజ్లిస్‌ కలిసి భాగ్యనగరాన్ని పాతబస్తీలా మార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వివిధ రాష్ట్రాలకు చెందిన మైనార్టీల ఆధ్వర్యంలో జరిగిన భారతీయ ఏక్తా సంఘటన్‌కు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి సంజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారని.. అసలు రాష్ట్రానికి తెరాస చేసిందేంటో చెప్పాలని నిలదీశారు. భాజపాను గెలిపిస్తే పాతబస్తీని భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని.. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే భాజపాను గెలిపించాలని బండి సంజయ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘‘ముమ్మారు తలాక్‌తో ముస్లిం సమాజం నష్టపోతుందని గుర్తించిన ప్రధాని మోదీ దాన్ని రద్దు చేశారు. చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తే మత కల్లోలాలు చోటుచేసుకుంటాయని మంత్రి కేటీఆర్‌ అంటున్నారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తేనే నగరం అభివృద్ధి చెందుతుంది. వరదల వల్ల ఒక్కో ఇంట్లో రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయారు. మూసీ నది నీళ్లను కొబ్బరి నీళ్లలా మారుస్తానని కేసీఆర్ చెప్పారు. మేయర్‌ పీఠాన్ని భాజపా కైవసం చేసుకోవడం ఖాయం. హైదరాబాద్‌ను అహ్మదాబాద్‌, ఇండోర్‌, సూరత్‌ ప్రాంతాల మాదిరిగా అభివృద్ధి చేస్తాం. ఎల్‌ఆర్‌ఎస్‌ పోవాలంటే తెరాస పోవాలి. తప్పుడు ప్రచారాలతో భాజపాను ఎవరూ అడ్డుకోలేరు’’ అని బండి  సంజయ్‌ అన్నారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని