close

తాజా వార్తలు

ఆరు రోజుల్లో రాజధాని నిర్ణయిస్తారా?:బొండా

మంగళగిరి: తాడేపల్లిలో సిద్ధమైన పత్రాలపై జీఎన్‌రావు కమిటీ సంతకాలు చేసిందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 10 జిల్లాలను కేవలం 6 రోజుల్లోనే కమిటీ పర్యటించిందన్నారు. ఆరు రోజుల్లో రాష్ట్ర రాజధానిని కమిటీ ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ఎవరినీ అడక్కుండానే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు వేశారని బొండా ఆరోపించారు. ఈ కమిటీ అందరినీ కలిశామని చెప్పడం అబద్ధమని బొండా ఉమా స్పష్టం చేశారు.

రైతులు కోర్టుకు వెళ్లడం వల్లే జీఎన్‌రావు కమిటీ నివేదిక బయటకు వచ్చిందని బొండా ఉమా అన్నారు. వరదలు వచ్చినా అమరావతి ఎప్పుడూ మునగలేదని.. వరద ముప్పు లేకుండా కొండవీటి వాగు నిర్మించామని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే జీఎన్‌రావు కమిటీ వేశారని దుయ్యబట్టారు. రాజధానిని నిర్ణయించే కమిటీలో ప్రణాళిక, ఆర్థిక నిపుణులు ఉంటారని.. అలాంటివారు ఈ కమిటీలో ఎవరైనా ఉన్నారా?అని బొండా నిలదీశారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పే అధికారం కమిటీకి ఉంటుందా?బెంచ్‌ల ఏర్పాటు ప్రభుత్వ సొంత వ్యవహారమా?అని బొండా ప్రశ్నించారు. ప్రశ్నించే వ్యవస్థలన్నింటినీ రద్దు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖను కించపరిచే విధంగా నివేదిక..

తెదేపా అధినేత చంద్రబాబు విశాఖలోనే అన్ని సమావేశాలను ఏర్పాటు చేసేవారని బొండా చెప్పారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని ఆయన ఎంతగానో ప్రయత్నించారన్నారు. విశాఖలో లులు గ్రూప్‌, అదానీ సెంటర్ తీసుకురావాలని చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని.. అక్కడ ఫార్మా, ఐటీ కేంద్రాలు తెదేపా హయాంలోనే వచ్చాయన్నారు. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా జీఎన్‌రావు కమిటీ నివేదిక ఉందన్నారు. విశాఖకు తుపాన్లు, కాలుష్య ముప్పు ఉందని జీఎన్‌రావు కమిటీ చెప్పిందని బొండా స్పష్టం చేశారు. ఈ కమిటీ నివేదిక చూసిన తర్వాత ఎవరైనా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారా?అని ప్రశ్నించారు.

9 నెలల్లో 30 వేల ఎకరాలు కొనుగోలు..

కమిటీల పేరుతో విశాఖ ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని బొండా ఆరోపించారు. కమిటీ ఛైర్మన్‌ ఎవరో.. కన్వీనర్‌ ఎవరో.. అనే విషయంలో వారికే స్పష్టత లేదని బొండా ఎద్దేవా చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం వెనక మర్మమేంటని బొండా ఉమా సందేహం వ్యక్తం చేశారు. విశాఖలో వైకాపా నేతలు 9 నెలల్లో 30 వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. వందేళ్ల చరిత్ర ఉన్న వాల్తేర్‌ క్లబ్‌, దసపల్లా భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. అక్కడ స్థలాల కబ్జాలకు కొన్ని బృందాలు తిరుగుతున్నాయని ఉమా ఆరోపించారు. విశాఖను కించపరిచే విధంగా జీఎన్‌రావు కమిటీ నివేదిక ఉందన్నారు. 130 హెచ్‌వోడీల కార్యాలయాలతో విశాఖ రూపురేఖలు మారతాయా?అని విమర్శనాస్త్రాలు సంధించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.