
తాజా వార్తలు
సరిహద్దుల్లో అంతా బాగానే ఉంది: చైనా
త్వరలోనే డబ్ల్యూఎంసీసీ సమావేశం
బీజింగ్: భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ గురువారం ఒక ప్రకటన చేశారు. త్వరలోనే భారత్-చైనా సరిహద్దు వ్వవహారాలకు సంబంధించి వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం జరగనుందని తెలిపారు. ‘‘ కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం మేరకు గల్వాన్తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భారత్-చైనా తమ బలగాల ఉపసంహరణకు సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం సరిహద్దు వెంట పరిస్థితులు స్థిరంగా, మెరుగ్గా ఉన్నాయి. త్వరలోనే డబ్ల్యూఎంసీసీ సమావేశం నిర్వహించి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తాం’’ అని లిజియాన్ పేర్కొన్నారు.
అయితే చైనా బలగాల ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి వివరాలను లిజియాన్ వెల్లడించలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ మాతో కలసి పనిచేస్తుందని, ఏకాభిప్రాయాన్ని అమలుచేసేందుకు కృషి చేస్తుందని చైనా ఆశిస్తుందని అన్నారు. గత నెలరోజులుగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశా ల సైనికుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగిన అంగీకారం మేరకు సైనిక బలగాలను ఉపసంహరించాయి. అయితే సరిహద్దుల్లో గస్తీ నిర్వహణ, ఇతర అంశాలు వంటి వాటిపై త్వరలో జరగనున్న భేటిలో చర్చించనున్నట్లు సమాచారం.