మోదీ ఆదేశించారు.. షా పాటించారు..!
close

తాజా వార్తలు

Updated : 13/05/2020 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీ ఆదేశించారు.. షా పాటించారు..!

దేశీయ ఉత్పత్తులకు పెద్దపీట వేసే దిశగా షా కీలక నిర్ణయం

దిల్లీ: కరోనా కష్ట కాలంలో స్థానికత, దేశీయ ఉత్పత్తి జీవన మంత్రం కావాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించి స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో అన్ని రకాల ‘కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్‌)’ క్యాంటీన్లలో దేశీయంగా తయారు చేసిన వస్తువుల్ని మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలు జూన్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో కేంద్ర బలగాలకు సంబంధించిన 50 లక్షల మంది కుటుంబ సభ్యులు, 10 లక్షల మంది జవాన్లు ఇకపై దేశీయ వస్తువుల్నే వినియోగించనున్నారు. సీఏపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్‌కు చెందిన క్యాంటీన్లలో ఏటా రూ.2,800 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు అమ్ముడవుతుంటాయి.

దేశ ప్రజలందరూ దేశీయంగా తయారైన ఉత్పత్తుల వినియోగానికే పెద్దపీట వేయాలని.. ఇతరులను కూడా ఆ దిశగా ప్రోత్సహించాలని అమిత్‌ షా కోరారు. దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలన్న మోదీ నిర్ణయం.. ప్రపంచానికి భారత్‌ మార్గనిర్దేశం చేయాలన్న కలను సాకారం చేసేందుకు బాటలు వేయనుందని షా అభిప్రాయపడ్డారు.   

కరోనా సంక్షోభం నేపథ్యంలో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్షోభ సమయంలో దేశ అవసరాలన్నింటినీ స్థానిక వ్యవస్థలే తీర్చిన సంగతిని మోదీ గుర్తుచేశారు. ‘‘స్థానికత మన జీవన మంత్రం కావాలి. ప్రపంచస్థాయి బ్రాండ్లన్నీ ఒకప్పుడు స్థానికమైనవే. విస్తృత వాడకం, ప్రచారంతోనే అవి ప్రపంచస్థాయికి ఎదిగాయి. ఇకపై ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలి. వాటికి ప్రచారం కల్పించాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని