close

తాజా వార్తలు

Published : 24/09/2020 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతి అంగుళమూ ఆన్‌లైన్‌లో నమోదు: కేసీఆర్‌

నగరపాలికల పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం

హైదరాబాద్‌: కొత్త చట్టాల అమలు సందర్భంగా ఏ ఒక్క నిరుపేదకూ కష్టం వాటిల్లకుండా చివరి గుడిసె వరకూ ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారంపై జీహెచ్‌ఎంసీ సహా నగరపాలికల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశమయ్యారు. ప్రజలే కేంద్రబిందువులుగా.. వారి సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలూ కష్టపడాల్సిన బాధ్యత ఉందని సీఎం చెప్పారు. 

ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి

భూముల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్‌ఎస్‌) ద్వారా ఖజానాను నింపుకోవాలని ప్రభుత్వం చూడడం లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునేలోపే ప్రజల భూములు, ఆస్తుల సమస్యలన్నింటికీ శాశ్వతంగా విధానపర పరిష్కారాలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదుకాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం సూచించారు. భూముల ధరలు పడిపోతాయంటూ గిట్టనివాళ్లు రాష్ట్ర ఆవిర్భావ సమయంలో శాపాలు పెట్టారని.. ప్రభుత్వ చర్యలతో ఆ అంచనాలను తలకిందులు చేస్తూ వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోందన్నారు. సుస్థిరపాలన వల్ల భూతగాదాలు, కబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరి తగ్గిందని చెప్పారు. 

నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదు

స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేస్తాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయా చట్టాల అమల్లో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపైనే ఉందన్నారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌ తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్‌బుక్‌లు ఇవ్వడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరిగి ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.