close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120046334 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 9kDoYyWlm3Y [video_short_link] => 9kDoYyWlm3Y [created_by] => [created_date] => [modified_by] => 9030304 [modified_date] => 2020-04-06 22:06:12.077927 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

లాక్‌డౌన్‌ కొనసాగించాలని చెప్పా: కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగాలని కోరుకుంటున్నానని.. ప్రధాని మోదీకి కూడా ఇదే విషయం చెప్పానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. లాక్‌డౌనే సరైన ఆయుధమని చెప్పారు. ఆర్థికంగా నష్టపోతే మళ్లీ పూడ్చుకోవచ్చని.. ప్రాణంపోతే తీసుకురాలేమన్నారు. బతికుంటే బలుసాకు కూర తిని బతకొచ్చని.. ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్తిస్థాయిలో గాడిలో పడేందుకు కష్టబడతాం, మళ్లీ నిలదొక్కుకుంటాం అని వ్యాఖ్యానించారు. అమెరికా, స్పెయిన్‌, ఇటలీ దేశాలతో పోలిస్తే మనదేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 364కి చేరుకుందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 35 మంది, ఇండోనేసియా వాళ్లు 10 మంది డిశ్చార్జ్‌ కాగా.. 11 మంది మృతిచెందారని వివరించారు. మిగతా 308 మంది ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని చెప్పారు. దిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో 172 మందికి వైరస్‌ సోకిందని.. వారి ద్వారా 93 మంది కుటుంసభ్యులకూ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో సుమారు 600 మందికి పరీక్షలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని.. వాటిలో మరో 100-110 కేసులు పాజిటివ్‌గా వచ్చే అవకాశముందని చెప్పారు. అక్కడితో  పాజిటివ్‌ కేసులు ఆగిపోవచ్చని భావిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా సహకరించారని తెలిపారు. 

అమెరికా పరిస్థితి దయనీయం..

‘అమెరికాలో పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ట్రక్కుల్లో మృతదేహాలను పంపుతున్న దయనీయ పరిస్థితి అక్కడ నెలకొంది. 2లక్షలకు పైగా చనిపోతారని అమెరికా అధ్యక్షుడే చెబుతున్నారు. అన్ని వనరులూ ఉన్న అమెరికాకే ఇంత భయంకరమైన దుస్థితి వచ్చింది. అదే పరిస్థితి మనదేశంలో వస్తే మృతుల సంఖ్య కోట్లలో ఉండేది. ఆయా దేశాలతో పోలిస్తే మనదేశంలో పరిస్థితి అదుపులోనే ఉంది. ఇది మానవ జాతి ఎదుర్కొంటున్న సంక్షోభం. 22 దేశాలు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ చేశాయి. మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్‌ చేశాయి. దీన్ని బట్టి సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఎవరూ శిక్షగా భావించొద్దు. మన రాష్ట్రంతో పాటు కేంద్రంలో మంచి నిర్ణయం తీసుకున్నాం. లాక్‌డౌన్‌, స్వయంకృషి, స్వయం నియంత్రణ, క్రమశిక్షణ వల్లే భారత సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నాం’ అని కేసీఆర్‌ అన్నారు.


బయటకు రానివ్వడం లేదనే బాధ వద్దు

‘బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ ) సంస్థ భారత్‌లో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని అభిప్రాయడింది. మనలాంటి దేశానికి లాక్‌డౌన్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అదే సరైన ఆయుధం. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందనే వాదాలు ఉన్నాయి.  తెలంగాణలో సగటున రోజుకి రూ.400 నుంచి రూ.440 కోట్ల ఆదాయం రావాలి. ఏప్రిల్‌లో ఈ సమయానికి రూ.2,400 కోట్లు రావాలి. వచ్చింది కేవలం 6 కోట్లు మాత్రమే. మన పరిస్థితే ఇలా ఉంటే.. దేశం పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే మనది సంతోషకర స్థితి. నా అభిప్రాయం లాక్‌డౌన్‌ ఎత్తివేయకూడదు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆహార నిల్వలు, ఆర్థిక స్థితి, ప్రస్తుత పరిస్థితిని ఎలా అధిగమించాలి, ఇంకా ఎంతకాలం లాక్‌డౌన్‌ కొనసాగించాలి లాంటి చర్చలు జరుగుతున్నాయి. మనిషి జీవితంలోనే ఇలాంటి పరిస్థితి రాలేదు. బయటకు రానివ్వడం లేదని ఎవరూ బాధపడొద్దు’ అని సీఎం అన్నారు.

ప్రాథమిక దశలోనే గుర్తించి ఆస్పత్రికి రావాలి

‘జబ్బు విచిత్రమైంది..మందు లేదు. పరిస్థితి విషమించిన తర్వాత వచ్చిన రోగులకు వెంటిలేటర్‌ పెట్టేలోపే చనిపోతున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి ప్రాథమిక దశలోనే వస్తే బతకొచ్చు. తీవ్రరూపం దాల్చిన తర్వాత వచ్చినవారే చనిపోతున్నారు.
ప్రాథమిక దశలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే గుర్తించి ఆస్పత్రికి రావాలి. వేలు, లక్షల సంఖ్యలో చనిపోవడం అనే ఊహే భయంకరంగా ఉంటుంది. మరణం మిగిల్చే విషాదాన్ని దేశం భరించలేదు. యుద్ధం మిగిల్చే విషాదం ఎంత భయంకరంగా ఉంటుందో ఇది కూడా అలాంటిదే. ప్రధాని పిలుపుపై సామాజిక మాధ్యమాల్లో జోకులు వేయడం మంచిది కాదు. చిల్లర రాజకీయాలు, ప్రచారం చేసే వాళ్లు ఇప్పుడు అవసరం లేదు. కష్టంలో కన్నీళ్లు పంచుకునే వారే ఇప్పుడు కావాలి. ఒకరికొకరు ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చే వాళ్లు అవసరం. స్వీపర్‌ మొదలుకుని వైద్య సిబ్బందికి పాదాభివందనం. పొగిడే నోళ్లు ఇప్పుడు వైద్య సిబ్బందికి కావాలి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికోసం 8 ఆస్పత్రులు నోటిఫై చేశాం. 25 వేల మంది అదనపు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. తమకూ వైరస్‌ సోకవచ్చని తెలిసినా వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. పోలీసులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారు.. వారికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఇంటెలిజిలెన్స్‌ బృందాలు చాలా సమర్థంగా పనిచేశాయి. మర్కజ్‌ కేసుల్లో చాలా వరకు వాళ్లే గుర్తించారు. వాళ్లకీ కృతజ్ఞతలు’ అని కేసీఆర్‌ చెప్పారు. 

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సిబ్బందికి నగదు ప్రోత్సాహకం..

‘నగరాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సిబ్బంది, గ్రామాల్లో సఫాయీ కర్మిచారీలు ప్రతి వీధి, గల్లీ గల్లీ తిరిగి రసాయనాలు పిచికారీ చేసి అద్దంలా ఉంచుతున్నారు వీళ్లంతా కలిపి రాష్ట్రంలో 95,392మంది ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసేవారికి కోత విధించలేదు గానీ.. మున్సిపాలిటీలు/జీహెచ్‌ఎంసీ సిబ్బంది వేతనంలో మొన్న కోత పెట్టాం. ఆ మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో ఇస్తాం. అలాగే, ప్రత్యేక ప్రోత్సాహ నిధి కింద జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సిబ్బందికి రూ.7500లు ప్రత్యేక పో్త్సాహకంగా ఇస్తాం. మున్సిపాలిటీలు/గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తలో రూ.5000చొప్పున ఇస్తాం. సఫాయి అన్నా నీకు సలాం అన్నా. మీరు కరోనా నుంచి కాపాడుతున్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేయండి. మీకు గుర్తింపు ఉంటుంది’ సీఎం స్పష్టం చేశారు.

వైద్య సిబ్బందికి సీఎం గిఫ్ట్‌

‘కొవిడ్‌- 19 వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్య శాఖ సిబ్బందికి మొన్న పూర్తి వేతనం ఇవ్వాలని చెప్పాం. వారి సేవలను గుర్తించి తాజాగా సీఎం గిఫ్ట్‌ కింద వాళ్లందరికీ  10శాతం గ్రాస్‌ శాలరీ ఇస్తున్నాం. వాళ్లకు వెంటనే డబ్బులు అందజేస్తాం. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడాం. వాళ్లకు వెంటనే అందజేస్తాం. ఈ మేరకు జీవో విడుదల చేస్తాం. పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ధన్యవాదాలు’ అని అన్నారు.

దుర్మార్గులను వదిలిపెట్టం..

‘ఈ విపత్కర సమయంలో కొన్ని పత్రికలు దుర్మార్గంగా రాస్తున్నాయి. రాష్ట్రంలో ఔషధాల కొరత లేదు. మావద్ద 40వేల పీపీఈ కిట్లు ఉన్నాయి. 5లక్షల కిట్లకు ఆర్డర్‌ చేశాం. మేం నిద్ర లేకుండా పనిచేస్తున్నాం. లోకం ఆగమవుతుంటే చిల్లర వేషాలు వేయడం సరికాదు. అనుచితంగా వ్యవహరిస్తే సరైన సమయంలో సరైన శిక్ష వేస్తాం. దుర్మార్గులను వదిలిపెట్టం. సంక్షోభ, క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాలి. నేను మీడియాకు వ్యతిరేకం కాదు. రాజకీయాలకు బోలెడంత సమయం ఉంది. అసత్యాలు ప్రచారం చేసేవారిని వదిలిపెట్టం’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.