
తాజా వార్తలు
‘పది’ పరీక్షలపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొససాగుతూనే ఉంది. నిన్న జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదైతే పరీక్షా కేంద్రాలను మార్చాలని కూడా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం హైకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది. జీహెచ్ఎంసీ మినహా పరీక్షలు నిర్వహిస్తే సాంకేతికంగా అనేక ఇబ్బందులతో పాటు విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్షల నిర్వహణపై రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలా లేదా అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలా అనేదానిపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా ఉద్ధృతిలో మరోసారి పరీక్షలు నిర్వహించాలంటే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండగా.. పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..
పది పరీక్షలు వాయిదా