close

తాజా వార్తలు

Published : 20/10/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతి ఇంటికి ₹10వేల ఆర్థిక సాయం: కేసీఆర్‌

హైదరాబాద్‌: భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వర్షాలు, వరదనీటి ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10వేలు చొప్పు ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వర్షాల వల్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదార్లు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడాలని వరదలపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.

పేదలకు సాయం అందించేందుకు పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని తెలిపారు. కష్టాల పాలయ్యే వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని, అంతకు మించిన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి పదివేల రూపాయల చొప్పున రేపు ఉదయం నుంచే అందించాలని స్పష్టంచేశారు. నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగాలని సీఎం ఆదేశించారు. అన్ని చోట్లా ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భాగస్వామ్యులు కావాలని సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంత మంది ఉన్నా సాయం అందిస్తామని, లక్ష మందికైనా సరే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తెరాస కార్యకర్తలు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

భారీవర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చాటాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం పది కోట్ల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సీఏం కేసీఆర్‌కు లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్రం తరఫున రూ.10 కోట్లు ఆర్థికసాయంతో పాటు పెద్దసంఖ్యలో దుప్పట్లు, చద్దర్లు పంపుతున్నట్లు ప్రకటించారు. ఇంకా అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, ప్రజలు, సీఎం పళనిస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉదారంగా ముందుకు వచ్చినందకు ధన్యవాదాలు తెలిపారు.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని