
తాజా వార్తలు
దిల్లీపై కరోనా పంజా:ఈరోజే కేసులు అత్యధికం
దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ ఒక్క రోజులోనే కొత్తగా రికార్డు స్థాయిలో 660 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దిల్లీలో మొత్తం 12,319 కేసులు నమోదు కాగా.. 208 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మే 21న ఒక్క రోజులో అత్యధికంగా 571 కేసులు నమోదు కాగా.. తొలిసారిగా 600 కేసులు నమోదవడం ఇదే ప్రథమం. దిల్లీలో ఇప్పటివరకు 5600 మందికి పైగా కోలుకున్నారు.
సంజయ్ ఝాకు పాజిటివ్
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, లక్షణాలు బయటపడలేదు. ఇప్పటికే హోం క్వారంటైన్లో ఉన్నా. మరో 10 నుంచి 12 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉంటా. కరోనాతో అందరం ప్రమాదంలో ఉన్నాం. ఈ వైరస్ వ్యాప్తితో ఉన్న ముప్పును తక్కువగా అంచనా వేయొద్దు’’ అని పేర్కొన్నారు.