
తాజా వార్తలు
ఉద్రిక్తతకు దారితీసిన సీపీఐ ‘చలో పోలవరం’
అమరావతి: సీపీఐ తలపెట్టిన చలో పోలవరం యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బస చేసిన హోటల్లోనే ఆయన్ను నిర్బంధించారు. అనంతరం హోటల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నేతల నిర్బంధాలను నిరసిస్తూ హోటల్ ఎదుట ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టును చూడనివ్వకుండా అడ్డుకోవడం సరైంది కాదని సీపీఐ నేతలు మండిపడ్డారు. సీపీఐ నేతలు తలపెట్టిన యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని తొలుత పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం హోటల్లోకి అనుమతించారు.
పోలవరం సందర్శన కోసం వెళ్లిన సీపీఐ నాయకులను పోలీసులు నిర్బంధించడాన్ని నిరసిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో ఆందోళన చేశారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. అక్రమంగా నిర్బంధించిన సీపీఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. దానిని ఏ సమయంలోనైనా ఎవరైనా పరిశీలించే హక్కు ఉంటుందన్నారు. అర్థరాత్రి పూట అక్రమ అరెస్టులకు పాల్పడుతూ అప్రజాస్వామికంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. సీపీఐ ఆందోళనలతో తిరుపతిలో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.