
తాజా వార్తలు
అభివృద్ధికి మండలి ఎక్కడ అడ్డు?: రామకృష్ణ
విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇతర రాష్ట్ర ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. మూడు కాదు రాష్ట్రానికి హైదరాబాద్‌తో కలిపి నాలుగు రాజధానులు అని రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారని, శాంతియుతంగా ఉండే తెనాలి లాంటి చిన్న పట్టణాల్లో కూడా అలజడులు జరుగుతున్నాయన్నారు. మండలిలో జరిగిన నిర్ణయం నేరమైనట్టు మండలి రద్దు తీర్మానం చేశారని మండిపడ్డారు.
ఫిరాయింపులను ప్రోత్సహించను అని చెప్పి మూడు రోజులు మండలి సభ్యులను ప్రలోభాలకు గురిచేశారని రామకృష్ణ దుయ్యబట్టారు. అభివృద్ధికి మండలి అడ్డుపడుతోందని సీఎం చెబుతున్నారని.. ఎక్కడ అడ్డుపడిందని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేస్తామంటే మండలి అడ్డు వచ్చిందా?లోటు బడ్జెట్, ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తామంటే అడ్డుపడిందా? అని నిలదీశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించే దమ్ము లేక మండలి రద్దు ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని రామకృష్ణ ఆరోపించారు. ఈ ప్రభుత్వం బెదిరింపులు, ప్రలోభాలతో కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు.