close

తాజా వార్తలు

Updated : 10/08/2020 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాణం కాపాడిన ఫేస్‌బుక్‌ అలర్ట్‌..!

‘సూసైడల్‌ యాక్టివిటీ’ని గుర్తించిన ఫేస్‌బుక్‌
రంగంలోకి దిగిన దిల్లీ, ముంబయి పోలీసులు
గంటల వ్యవధిలోనే యువకుడిని కాపాడిన పోలీసులు

ముంబయి: ఓ వ్యక్తి ప్రాణం తీసుకునే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఫేస్‌బుక్‌ అప్రమత్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం గాలించి చివరకు యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన ముంబయిలో జరిగింది.

భారత్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియోలను తీసి తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలను విశ్లేషించిన ఫేస్‌బుక్‌ ‘సూసైడల్‌ యాక్టివిటీ’గా గుర్తించింది. వెంటనే రెడ్‌ ఫ్లాగ్‌ సూచించింది. ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్‌ ఉద్యోగి దీన్ని గుర్తించారు. అనంతరం అకౌంటు వివరాలు చూడగా అది దిల్లీకి చెందిన యువకుడిగా గుర్తించారు. సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఈ విషయాన్ని దిల్లీ పోలీసులకు ఫేస్‌బుక్‌ ఉద్యోగి ఈమెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన దిల్లీ సైబర్‌ క్రైం డీసీపీ అన్యేష్‌ రాయ్‌, ఆ ఫోన్‌ నెంబర్‌ దిల్లీలోనే రిజిస్టర్‌ అయినట్లు గుర్తించారు. దీంతో ఆ యువకున్ని గుర్తించి ఎలాగైనా కాపాడాలని రంగంలోకి దిగారు. ఆ నెంబర్‌ ట్రేస్‌ చేసి తూర్పు దిల్లీలోని ఓ మహిళదిగా కనుగొన్నారు. వెంటనే ఓ బృందాన్ని అక్కడకు పంపించగా ఆమె ఎలాంటి ప్రమాద పరిస్థితుల్లో లేదని గుర్తించారు. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. ఆ ఫేస్‌బుక్‌ అకౌంటు తన భర్తదని, రెండు వారాల క్రితమే తనతో గొడవపడి ముంబయికి వెళ్లిపోయినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ముంబయిలో ఓ హోటల్‌లో తన భర్త పనిచేస్తుంటాడని తెలిపింది. అక్కడ అతని అడ్రస్‌ తనకు తెలియదని కేవలం ఫోన్‌ నెంబరు మాత్రమే ఉందని పోలీసులకు ఇచ్చింది.

దిల్లీ పోలీసులు ముంబయి పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. దీన్ని సవాలుగా తీసుకున్న ముంబయి పోలీసులు ఎలాగైనా అతన్ని కాపాడాలని రంగంలోకి దిగారు. ఆ వ్యక్తి నెంబర్‌కు ఫోన్‌ చేయగా అది అందుబాటులో లేనట్లు తేలింది. ఆ సమయంలోనే అతని లొకేషన్‌ గుర్తించేందుకు వాట్సాప్‌ నెంబరుకు వీడియో కాల్‌ చేయాలని యువకుడి తల్లికి సూచించారు. ఆమె ఫోన్‌ చేయగా ఒక్క రింగ్‌ మోగి అది ఆగిపోయింది. ఇలా సమయం గడిచే కొద్దీ వారిలో ఆందోళన పెరిగింది. అయితే, కొద్ది సమయం తరువాత ఆ యువకుడు మరో నెంబరు నుంచి తన తల్లికి ఫోన్‌ చేశాడు. అనంతరం పోలీసులు అతనికి నచ్చజెప్పేందుకు గంటపాటు మాటలను కొనసాగించారు. అదే సమయంలో అతడు ఉంటున్న లొకేషన్‌ను కనుగొన్న పోలీస్‌బృందం అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో అక్కడకు చేరుకొన్నారు. చివరకు అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చి యువకుడి ప్రాణాలు కాపాడగలిగినట్లు ముంబయి సైబర్‌ క్రైం డీసీపీ రష్మీ కరాందికర్‌ మీడియాకు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ రాత్రి ఒకటిన్నర వరకు కొనసాగిందని ముంబయి పోలీసులు వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.