
తాజా వార్తలు
రికవరీ రేటు చూసి నిర్లక్ష్యం పెరుగుతోంది
పాజిటివిటీ రేటు ఒక శాతానికి దిగువనే ఉండాలి
వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలి
సీఎంలతో సమావేశంలో ప్రధాని మోదీ
దిల్లీ: కొవిడ్ మహమ్మారి వల్ల ఎదురైన తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం తగదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ భవిష్యత్తు కార్యాచరణపై అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే రికవరీ, తక్కువ మరణాల రేట్లతో భారత్ ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని ప్రశంసించారు.
‘ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు కూడా బాగుంది. అయితే ఈ రికవరీలను చూసి చాలా మంది వైరస్ బలహీనపడిందని భావిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో కొవిడ్ పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది. ఈ నిర్లక్ష్యం తగదు. వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాల్సిందే. కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలి. కరోనా అప్రమత్తతపై మరోసారి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పాజిటివిటీ రేటు ఒక శాతానికి దిగువనే ఉండాలి. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది’ అని మోదీ చెప్పుకొచ్చారు.
రాష్ట్రాల అభిప్రాయాలు విలువైనవి
కరోనా చికిత్సలో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ సూచించారు. వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వెంటిలేటర్ల సరఫరాకు పీఎం కేర్స్ నిధులు వినియోగించాలని తెలిపారు. జిల్లాలు, బ్లాక్ స్థాయుల్లో కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టాస్క్ ఫోర్స్ లేదా స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్రాలు తగిన సూచనలు ఇవ్వాలని ప్రధాని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రాల అనుభవాలు, అభిప్రాయాలు చాలా విలువైనవని, వ్యాక్సిన్‌పై కేంద్రం నిర్ణయాలు తీసుకోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడుతాయని మోదీ చెప్పారు.
వేగంతో పాటు భద్రతా ముఖ్యమే
దేశం, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత టీకా తయారీ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందన్నారు. వ్యాక్సిన్ విషయంలో వేగం ఎంతముఖ్యమో భద్రత కూడా అంతే ప్రాధాన్యమని తెలిపారు. కొన్ని సందర్భాల్లో టీకా తీసుకున్న కొన్నేళ్ల తర్వాత కూడా దుష్ప్రభావాలు వస్తాయని, అందుకే శాస్త్రీయ పరంగా అన్ని కోణాల్లో పరీక్షించిన తర్వాతే వ్యాక్సిన్ అందజేస్తామని తెలిపారు. అయితే వ్యాక్సిన్ ధరలు, డోసుల వంటి ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేమని మోదీ అన్నారు.
కొవిడ్‌పై పోరులో ఎలాంటి దృష్టి సారించామో.. వ్యాక్సిన్ పంపిణీ విషయంలోనూ అంతే నిబద్ధతతో ఉంటామని ప్రధాని పేర్కొన్నారు. ప్రతిఒక్కరికీ టీకా అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత వ్యాక్సిన్ ప్రాధాన్యతను నిర్ణయిస్తామన్నారు. కాగా.. రాష్ట్రాలు కూడా పంపిణీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని రాష్ట్రాల్లో కోల్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.