
తాజా వార్తలు
కొవిడ్-19 ఎఫెక్ట్: పిల్లులకూ మాస్కులు
పెంపుడు జంతువులకూ మాస్కులు వేస్తున్న చైనావాసులు
బీజింగ్: రోజురోజుకూ విజృంభిస్తోన్న కొవిడ్-19 (కరోనా వైరస్)మహమ్మారితో చైనా కకావికలమవుతోంది. ఇప్పటికే 1700లకు పైగా చైనీయులను పొట్టనపెట్టుకున్న ఈవైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు డ్రాగన్ అన్ని విధాలుగా పోరాడుతోంది. వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్ పట్టణంలో ఇప్పటికే చాలా మంది ఇళ్లకే పరిమితం అవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇళ్లలో ఉన్నవారు కూడా కచ్చితంగా మాస్కులు ధరిస్తూనే కనిపిస్తున్నారు. కేవలం ప్రజలే కాదు..వారి పెంపుడు పిల్లులు, శునకాలకూ మాస్కులు వేస్తుండటం విశేషం. ఇప్పటికే చైనా వ్యాప్తంగా ఈ మాస్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇలా మాస్కులు ధరించిన పిల్లులు, శునకాల ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వ్యక్తులు ధరించే మాస్కులకే రంధ్రాలు చేసి పిల్లులకు కూడా తొడుగుతుండటం విశేషం.
ఇదిలా ఉంటే..పెంపుడు పిల్లులు, శునకాల నుంచి వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే వీటిని ముట్టుకున్న అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం మాత్రం మంచిదని పేర్కొంది. దీంతో పెంపుడు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే చాలా రకాల బాక్టీరియాలను అరికట్టవచ్చని తెలిపింది.
కానీ, చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మాత్రం దీంతో విభేదిస్తోంది. వైరస్ సోకిన వ్యక్తులతో పెంపుడు జంతువులు తాకినప్పుడు వాటికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అధికారుల భయపడుతున్నారు. వైరస్ అనుమానితుల వద్దకు పెంపుడు జంతువులను వెళ్లనియ్యొద్దని చైనా ప్రజలను హెచ్చరించింది. ఏదేమైనా..ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పెంపుడు జంతువులకు మాస్కులు తొడిగే వారి సంఖ్య పెరుగుతోంది.