కేంద్రమే ఆర్థికంగా సహకరించాలి: మోదీతో జగన్‌
close

తాజా వార్తలు

Updated : 11/05/2020 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రమే ఆర్థికంగా సహకరించాలి: మోదీతో జగన్‌

అమరావతి: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారని, లాక్‌డౌన్‌ మినహాయింపులపై కేంద్రం పునరాలోచించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. లాక్‌డౌన్‌‌ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు మందగించాయన్నారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్‌ పలు సూచనలు/ప్రతిపాదనలు చేశారు.

‘‘ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో లేకుండా రుణం మంజూరుచేస్తే వెసులుబాటు కలుగుతుంది. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు రూ.16వేల కోట్లు ఖర్చు అవుతుంది. వలస కూలీలకు ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాల మధ్య సరకు, ప్రజా రవాణా నిరంతరం జరిగేలా చూడాలి. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. కరోనా సోకిన వ్యక్తులు స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకొచ్చే వాతావరణం కల్పించాలి. బాధితులు సాంఘికంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు’’ అని అన్నారు. 

లాక్‌డౌన్‌ సడలింపులపై పునరాలోచించాలి

‘‘కేంద్రం ఆర్థికంగా రాష్ట్రానికి సహకరించాలి. వడ్డీలేని రుణంతో పాటు దీర్ఘకాలిక చెల్లింపునకు అనుమతించాలి. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలి. లాక్‌డౌన్‌ సడలింపులు; కంటైన్మెంట్‌ వ్యూహాలపై పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది.  కంటైన్‌మెంట్‌ కారణంగా ఆర్థికలావాదేవీలకు ఇబ్బంది నెలకొంది. దీనిలో మార్పులు చేయాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో క్లినిక్‌లను బలోపేతం చేసుకోవాలి’’ అని సూచించారు. 

ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టిసారించాలి

‘‘స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ఆర్థికరంగం తీవ్రంగా ప్రభావితమైంది. పుంజుకోవాలంటే ముడిసరకుల రవాణా, ప్రజా రవాణా కొనసాగించాలి. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు రవాణా విషయంలో ఇబ్బంది నెలకొంటోంది. రవాణా సేవల్ని పునరుద్ధరించేందుకు వివిధ రాష్ట్రాలు సహకరించేలా చూడాలి. ప్రజా రవాణాలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తాం. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతాం. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు.  ఆ దిశగా దృష్టిసారించాలి’’ అని సూచించారు.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని