close

తాజా వార్తలు

Updated : 05/12/2020 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ ప్రతిష్టంభన.. వెనక్కి తగ్గని రైతులు

9న మరోసారి చర్చలు!

8న భారత్‌ బంద్‌ కొనసాగుతుందన్న రైతు సంఘాలు

దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రైతులు వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. డిసెంబర్‌ 9న మరోదఫా చర్చలకు కేంద్రం ప్రతిపాదించగా.. అందుకు రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో బుధవారం మరో దఫా చర్చలు కొనసాగనున్నాయి. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవడమే తమ ప్రధాన డిమాండ్‌ అని చెబుతోన్న రైతు సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో మరింత వివరణతో ముందుకొచ్చేందుకు కేంద్రం సమయం కోరినట్టు సమాచారం.

భారత్‌ బంద్‌ కొనసాగుతుంది..

ప్రధానంగా రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై  కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ పాయింట్ల వారీగా 35 రైతు సంఘాల ముందు ఉంచినట్టు సమాచారం. వాటిని పరిశీలించిన రైతు నేతలు.. తమ ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్న కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటారో, లేదో చెప్పాలని అడిగినట్టు తెలుస్తోంది. వీటిని రద్దుచేసే పరిస్థితి లేదని, రైతు సంఘాలు అభ్యంతరం తెలిపిన వాటిలో ప్రధానంగా ఎనిమిది అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధమని మంత్రులు చెప్పినట్టు తెలిసింది. దీంతో వెనక్కి తగ్గని రైతు నేతలు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. అయితే, మరిన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చేందుకు మరింత సమయం కావాలని కేంద్రం కోరినట్టు రైతులు చెబుతున్నారు. ఈ నెల 9న జరగబోయే తదుపరి చర్చల్లో కేంద్రం ఎలాంటి వివరణలు, ప్రతిపాదనలతో ముందుకురాబోతుందో చూడాలి. మరోవైపు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 10 రోజులుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల 8న చేపట్టిన భారత్‌ బంద్‌ను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ కోరినప్పటికీ వారు అందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ఉద్యమంలో పాల్గొన్న చిన్నారులు, వృద్ధులను ఇంటికి పంపాలని కూడా కేంద్రమంత్రి తోమర్‌ రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు, తమ డిమాండ్లకు ఒప్పుకొంటేనే ఆందోళన విరమిస్తామని రైతులు తేల్చి చెప్పారు. 

ప్రస్తుతం 45 పంటలకు మద్దతు ధర ఉన్నా అందులో 94శాతం పంటలకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని రైతు సంఘాలు కేంద్రానికి తెలిపాయి. రైతులు పండించే పంటలను మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారిని అరెస్ట్‌ చేసి ఐదేళ్ల పాటు జైళ్లలో ఉంచాలని, వారిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసి కఠినంగా శిక్షించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. 

అందుకే తదుపరి చర్చలకు అంగీకరించాం
తమ శాంతియుత ఆందోళనకు కేంద్రం అభినందించిందని రైతు పోరాట సమితి నేతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిరసన తెలపడంపై కేంద్రం అభినందించిందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తామని కేంద్రం చెప్పిందని, ఈ నెల 9న ఎలాంటి ప్రతిపాదనలతో వస్తారో చూడాల్సి ఉందన్నారు. తమ డిమాండ్ల సాధనలో కొంత పురోగతి ఉందని అనిపించిందని, చర్చల్లో పురోగతి ఉన్నందునే ఈ నెల 9న చర్చలకు అంగీకరించినట్టు చెప్పారు. శాంతియుత ఆందోళనలు, డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టంచేశారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని