
తాజా వార్తలు
కరోనా ఎఫెక్ట్: 3 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
దిల్లీ: దేశవ్యాప్తంగా రెండో విడతగా కరోనా ప్రబలే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఎక్కువ మొత్తంలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. ఆయా రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తూ, వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందాలు సహాయ పడతాయి. గతంలో హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బృందాలను పంపిన కేంద్రం.. తాజాగా ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లకు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరోవైపు దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. అదే సమయంలో కరోనా రెండో విడత వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,40,962 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.69 శాతంగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులు కూడా తగ్గుముఖం పట్టడం సంతోషించదగ్గ విషయం. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం తాజా చర్యలు చేపట్టింది.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 20 వేల నుంచి 50 వేల మధ్య క్రియాశీల కేసులు ఉన్నాయని, మహారాష్ట్ర, కేరళలో కేసులు నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. కేరళలో గడిచిన 24 గంటల్లో 5,772 మందికి కరోనా సోకగా..6,179 మంది కోలుకున్నారు. మరోవైపు దిల్లీలో 5,879 మంది వైరస్ బారిన పడగా..6,963 కోలుకున్నారు. మహారాష్ట్రలో కొత్తగా 5,760 కేసులు నమోదు కాగా..4 ,088 బయటపడినట్లు కేంద్రం వెల్లడించింది.