close
Array ( ) 1

తాజా వార్తలు

రాజధాని ఏ ఒక్క వర్గానిదీ కాదు: చంద్రబాబు

అమరావతి: రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తే.. అత్యధికమంది విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని సూచించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ప్రతి తెలుగు బిడ్డ గర్వించేలా ప్రపంచస్థాయి రాజధాని కావాలని తాము ఆకాంక్షించామన్నారు. శాసనసభలో రాజధాని అమరావతిపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి అంటే నాలుగు భవనాలు కాదని, భవిష్యత్తు తరాల ఉపాధికి బాసటగా ఉండాలనే లక్ష్యంతోనే రాజధాని నిర్మాణం చేపట్టామని చెప్పారు. అమరావతి ప్రజా రాజధాని అని.. ఏ కొంతమందికో, ఏ ఒక్క వర్గానికో సంబంధించినది కాదన్నారు. మిగతా రాష్ట్రాలతో పాటు తాము కూడా పైకి వస్తామనే ధీమా కలిగించాలనే అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వివరించారు. సంపద సృష్టించకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదన్నారు. ‘13 జిల్లాల అభివృద్ధికి రాజధానే ఆదాయవనరు. సంక్షేమ కార్యక్రమాలకు ఆదాయం అవసరం. దానివల్లే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి.. ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం అమరావతి’ అని చంద్రబాబు వివరించారు. 

జగన్‌ కూడా అంగీకరించారు

రాజధాని ప్రాంతం ఎంపికపై గతంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ సూచనను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేక విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు సెప్టెంబర్ 4, 2014న అసెంబ్లీ సాక్షిగా జగన్‌ చెప్పారన్నారు. రాజధాని కోసం 30వేల ఎకరాల భూమిని సేకరించాలని సభలో ఆయన సూచించారని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ జరగని విధంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో 33వేల ఎకరాలు సేకరించామన్నారు. రాజధాని ప్రాంతంలో ఎందుకు ఓడిపోయారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినా 2004లో ఖైరతాబాద్‌ స్థానంలోనూ ఓటమి పాలయ్యామన్నారు. అలాగని ఓటమికి తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. ‘హైదరాబాద్ అభివృద్ధిలో నా ముద్ర ఎప్పటికీ ఉంటుంది. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు గురించి ఆనాడే ఆలోచించామంటే అదీ నాకున్న విజన్‌’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాలకూ అనుకూలమైన ప్రాంతం కాబట్టే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామని పునరుద్ఘాటించారు. గత ఆరునెలల్లో రాష్ట్ర ఆదాయం 33 శాతం మాత్రమేనని.. ఆర్దిక మాంద్యం కొంత ప్రభావం చూపగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొంత కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజధానిలో నిర్మాణాలు కొనసాగితే జీఎస్టీ, సెంట్రల్‌ ఎక్సైజ్‌ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. సమాజం, రాష్ట్రం శాశ్వతమని చెప్పారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.