close

తాజా వార్తలు

ఏం తమాషాలు చేస్తున్నారా?

చీఫ్‌ మార్షల్‌పై చంద్రబాబు ఆగ్రహం

ఈనాడు, అమరావతి: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం శాసనసభ చీఫ్‌ మార్షల్‌ చియోఫిలస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి చేతిలోని బ్యానర్‌ను, ప్లకార్డ్‌ను చీఫ్‌ మార్షల్‌ లాక్కోవడంపై ఆయన మండిపడ్డారు. ఉదయం సమావేశాలు మొదలవడానికి ముందు, శాసనసభ ప్రధానద్వారం వద్ద... వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ఇవ్వాలన్న డిమాండ్‌తో తెదేపా సభ్యులు ఆందోళన చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మిగతా సభ్యుల నుంచీ బ్యానర్లు, ప్లకార్డులు తీసుకోవాలని మార్షల్స్‌ని చీఫ్‌ మార్షల్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ‘‘ఏం తమాషాలు చేస్తున్నారా? కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారా? ఒక ఉన్మాది సీఎం అయితే మీరూ అలాగే ప్రవర్తిస్తారా?...’’ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో నిలదీశారు.


సస్పెండ్‌ చేయాలి

శాసనమండలి సభ్యులను మార్షల్స్‌ ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, మహిళా సభ్యులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తెదేపా మహిళా ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్‌ మార్షల్‌ను తక్షణమే సస్పెండ్‌ చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. ‘తెదేపా నిరసన సందర్భంగా మంగళవారం గేట్లు మూసి మా చేతుల్లో ఉన్న కాగితాలు చించేశారు. అరచేతులు చూపించాలంటూ అనుచితంగా ప్రవర్తించారు. బుధవారం కూడా అదే తరహాలో వ్యవహరించారు. కేవలం స్పీకర్‌ ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారు. స్పీకర్‌ ఆదేశాలు శాసనసభ వరకే పరిమితమవుతాయి. మండలికి వర్తించబోవు. సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి. మండలి సభ్యుల హక్కులను పరిరక్షించాలి’ అని తెదేపా మహిళా ఎమ్మెల్సీలు  విజ్ఞప్తి చేశారు.


తెదేపా వాకౌట్‌

పెంచిన ఆర్టీసీ బస్‌ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం తెదేపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. ఆర్టీసీ బస్‌ ఛార్జీలపై అత్యవసర చర్చకు తెదేపా ఎమ్మెల్యే బి.అశోక్‌ ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్పవ్యవధి ప్రశ్నకు సమాధానం చెప్పాలని హోం మంత్రి సుచరితకు ఆయన సూచించారు. ఆమె మాట్లాడటం ప్రారంభించగానే తెదేపా ఎమ్మెల్యేలు అత్యవసర చర్చకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. సభాపతి పోడియం ముందుకెళ్లి హోం మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఆర్టీసీపై బిల్లు తీసుకొస్తున్నామని, అప్పుడు చర్చించే వీలుంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌పై చర్చ జరగకుండా తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుకోవడం సరికాదని చెప్పారు. సభని తప్పుదోవ పట్టించడం తెదేపాకు అలవాటుగా మారిందని బుగ్గన విమర్శించారు. ప్రభుత్వం బిల్లు పెడుతుందని చెబుతున్నందున, అప్పుడు మాట్లాడొచ్చని సభాపతి కూడా తెదేపా సభ్యులకు సూచించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.2 వేల కోట్ల భారం పడుతున్నందున, ఇప్పుడే చర్చకు అనుమతించాలని తెదేపా నేతలు మరోమారు గట్టిగా పట్టుబట్టారు. చర్చకు అనుమతించేది లేదని, పోడియం ఆవరణ నుంచి సీట్లోకి వెళ్లి కూర్చోవాలని సభాపతి స్పష్టం చేశారు. చివరకు సభాపతి తీరుకు నిరసనగా వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడితో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేంతా బయటకు  వెళ్లిపోయారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.