
తాజా వార్తలు
క్రికెట్లో ఆ షాట్‌ను నిషేధించాలి
ఇంటర్నెట్‌డెస్క్: ‘స్విచ్ హిట్టింగ్’ షాట్‌ను నిషేధించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఐసీసీకి సూచించాడు. ఆ షాట్ బౌలర్‌కు, ఫీల్డింగ్ జట్టుకు అన్యాయం చేస్తుందని అభిప్రాయపడ్డాడు. బౌలర్ బంతిని సంధించే ముందు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ పూర్తిగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా మారి షాట్లు ఆడటాన్ని స్విచ్ హిట్టింగ్ అంటారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్×ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో గ్లెన్ మాక్స్వెల్, డేవిడ్ వార్నర్ చాలా సార్లు స్విచ్ హిట్టింగ్తో పరుగులు సాధించారు.
‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్ల బ్యాటింగ్ అసాధారణమైంది. స్మిత్, మాక్స్వెల్ వంటి ప్లేయర్లు ఎంతో సులువుగా షాట్లు ఆడతారు. కొన్ని షాట్లు నమ్మశక్యంగా అనిపించవు. స్విచ్ హిట్టింగ్ ఎంతో నైపుణ్యమైన షాట్. మాక్స్వెల్, వార్నర్ ఎన్నోసార్లు ఆడారు. కానీ అది న్యాయబద్ధమైనది కాదు, చట్టవిరుద్ధమైన షాట్. ఫీల్డింగ్ చేసే జట్టుకు నష్టం చేస్తుంది’’ అని ఛాపెల్ అన్నాడు. బౌలింగ్ వేసే ముందు బౌలర్ ఏ స్థానం నుంచి బౌలింగ్ చేస్తున్నాడనేది అంపైర్‌కు ముందుగా తెలియజేస్తున్నట్లు బ్యాట్స్‌మన్ కూడా స్విచ్ హిట్టింగ్ గురించి చెబితే అది న్యాయబద్ధంగా ఉంటుందని పేర్కొన్నాడు.
బ్యాట్స్‌మన్ తన చేతివాటాన్ని మార్చడం వల్ల ఫీల్డర్ల స్థానాలు బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటాయని, దీని వల్ల బౌలింగ్ జట్టుకు నష్టం కలుగుతుందని ఛాపెల్ తెలిపాడు. కాగా, దీనిపై ఆటగాళ్లు ఫిర్యాదు ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. ‘కుడిచేతి వాటం బౌలర్, ఓవర్ ది వికెట్’ అని అంపైర్‌కు చెప్పి ‘ఎరౌండ్ ది వికెట్’ బౌలింగ్ చేస్తే అంపైర్ కచ్చితంగా ఫిర్యాదు చేస్తాడని, కానీ బ్యాట్స్‌మెన్ విషయంలో ఎందుకు ఇలాంటి నిబంధనలు లేవని ఛాపెల్ ప్రశ్నించాడు.