
తాజా వార్తలు
ఆహార రసాయనాల సమ్మేళనంతో వైరస్ నిరోధం!
నార్త్ కరోలినా శాస్త్రవేత్తల పరిశోధనల్లో గుర్తింపు
న్యూయార్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఔషధాలు, వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విశేష కృషి జరుగుతోంది. అయితే, ఇవే కాకుండా ఇతర విధానాల్లోనూ వైరస్‌ను నిరోధించే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో ఆహారంలోని రసాయన సమ్మేళనాలు కూడా కరోనాకు కారణమైన సార్క్-కోవ్-2ను నిరోధించగలుగుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా గ్రీన్ టీ, కొన్ని రకాల ద్రాక్షలోని రసాయన సమ్మేళనాలు వైరస్‌లో కీలకమైన ఎంజైమ్ పనితీరును ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
వైరస్ కణాల ఆరోగ్యం, కదలికలకు ఎంజైమ్‌లు ఎంతో కీలకం. ఒకవేళ వీటి పనితీరును నిరోధించగలిగితే మాత్రం రెప్లికేషన్ వంటి ముఖ్యమైన విధులను కణాలు నిర్వహించలేవు. ఇలా ఆహారపదార్థాల్లోని రసాయన పమ్మేళనాలు వైరస్‌లోని నిర్ధిష్ట ఎంజైమ్ పనితీరును బంధించే సామర్థ్యం ఉందని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా గ్రీన్ టీ, మస్కడైన్ ద్రాక్ష, డార్క్ చాక్లెట్ వంటి ఆహార పదార్థాలు, పానీయాల్లోని కెమికల్ కాంపౌండ్లు వీటిని నిరోధించగులుగుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. మానవ కణాలతో బంధించబడిన వైరస్‌ను లేదా వాటి వ్యాప్తిని ఆహార, ఔషధ మొక్కల్లోని రసాయనాలు ఎలా నిరోధిస్తాయోనని తెలుసుకునే లక్ష్యంతోనే ఈ పరిశోధన చేపట్టినట్లు ప్రొఫెసర్ డే-యూ షీ పేర్కొన్నారు. ఇందుకోసం కంప్యూటర్ సిమ్యులేషన్‌తో పాటు పరిశోధన కేంద్రాలలో వీటిని విశ్లేషించారు.
వివిధ ఆహార, మొక్కల రసాయన సమ్మేళనాలను ఎదుర్కొన్నప్పుడు సార్క్-కోవ్-2 వైరస్‌లో కీలకమైన (Mpro) ఎంజైమ్ ఏవిధంగా స్పందిస్తుందో అనే విషయాన్ని పరిశీలించారు. వైరస్ విచ్ఛిన్నం కావడానికి, తిరిగి ఒకేదగ్గరకు చేరుకునేందుకు సార్క్-కోవ్-2లోని Mpro అవసరమవుతుంది. ఒకవేళ ఈ ఎంజైమ్‌ను నిరోధించగలిగితే ఈ వైరస్ చనిపోతుందని ప్రొఫెసర్ డే-యూ షీ అభిప్రాయపడ్డారు. అందుకే అత్యంత శక్తివంతమైన రోగనిరోధకత, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన మొక్కల్లోని రసాయన సమ్మేళనాలు ఈ పనిని నిర్వర్తిస్తాయనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. Mpro ఎంజైమ్‌లో ఉండే ఒక పాకెట్ వంటి భాగాన్ని రసాయన సమ్మేళనాలతో నింపినపుడు అది చేయాల్సిన విధులను నిర్వర్తించడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు. ఇలా ఈ Mpro పనితీరును నిరోధించడంలో గ్రీన్‌టీ, మస్కడైన్ ద్రాక్షలోని రసాయన సమ్మేళనాలు ఎంతో విజయవంతంగా చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. వీటితో పాటు డార్క్ చాక్లెట్‌లోని రసాయనాలు కూడా వాటి పనితీరును సగంవరకు తగ్గిస్తున్నట్లు గుర్తించారు. తద్వారా వైరస్‌ను నిరోధించవచ్చిన పేర్కొన్నారు. తాజాగా ఈ పరిశోధనా పత్రాన్ని ఫ్రాంటియర్స్ ఇన్ ప్లాంట్ సైన్స్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనకు అమెరికా వ్యవసాయశాఖ మద్దతు తెలిపింది.