
తాజా వార్తలు
చెన్నైను బాధించే నాలుగు ఓటములు
గతరాత్రి ముంబయితో మరీ ఘోరం..
టీ20 మెగా క్రికెట్ లీగ్‌లో చెన్నై ఎంతటి గొప్ప జట్టో అందరికీ తెలిసిందే. మూడుసార్లు ఛాంపియన్. ప్రతీసారి ప్లేఆఫ్స్ లేదా సెమీఫైనల్స్ చేరిన జట్టు. ఈ లీగ్‌లో అత్యధిక విజయ శాతంతో కొనసాగుతున్న నంబర్ వన్ టీమ్. అలాంటిది ఈ ఏడాది ఘోరంగా విఫలమైంది. గతరాత్రి ముంబయితో తలపడిన మ్యాచ్‌లో ఎన్నడూ లేనంత చిత్తుగా మట్టికరిచింది. దారుణంగా ఓటమిపాలై అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై ఇదివరకు ఎక్కువ బంతుల తేడాతో ఓటమిపాలైన మ్యాచ్‌ల విశేషాలు ఒకసారి తెలుసుకుందాం..
* పీడకల మిగిల్చిన ముంబయి
షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై తేలిపోయింది. ఆడేది అసలు ధోనీసేనేనా అనే రీతిలో భంగపడింది. ఈ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 46 బంతులు మిగిలి ఉండగానే ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. సామ్‌కరన్(52) అర్ధశతకం బాదకపోయి ఉంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. దీంతో 20 ఓవర్లకు 114/9తో నిలిచింది. చిన్న లక్ష్యాన్ని ముంబయి ఉఫ్‌మని ఉదేసింది. ఓపెనర్లు డికాక్(46*), ఇషాన్ కిషన్(68*) ధాటిగా ఆడి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించారు. 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని చెన్నైకు పీడకల మిగిల్చారు.
* దడపుట్టిచ్చిన దిల్లీ
2012 సీజన్లో చెన్నై మరో ఘోర పరాభవం రుచిచూసింది. దిల్లీతో తలపడిన 11వ మ్యాచ్‌లో ఇలాగే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ధోనీసేన 110/8 స్కోర్‌తో నిలిచింది. బ్రావో(22), సురేశ్ రైనా(17) టాప్ స్కోరర్లు. అనంతరం సెహ్వాగ్ టీమ్ 13.2 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో దిల్లీ 8 వికెట్ల తేడాతో గెలుపొందడమే కాకుండా చెన్నై 40 బంతులు మిగిలి ఉండగానే ఓటమిపాలైంది.
* చితక్కొట్టిన జయసూర్య
2008 ఆరంభ సీజన్లో ధోనీసేన రెండుసార్లు ఇలాంటి ఓటములనే చవిచూసింది. ముంబయితో తలపడిన 36వ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లకు 156/6 స్కోర్ సాధించింది. కెప్టెన్ ధోనీ(43), సుబ్రహ్మణ్యం బద్రీనాథ్(53) రాణించారు. ఆపై లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి ఓపెనర్ సనత్ జయసూర్య(114*) చెలరేగిపోయాడు. తన విశ్వరూపం చూపించాడు. 48 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లు బాదడంతో ఒక వికెట్ నష్టపోయి ముంబయి 13.5 ఓవర్లలోనే గెలుపొందింది. దాంతో చెన్నై 37 బంతులు మిగిలి ఉండగానే మట్టికరిచింది.
* వణికించిన రాజస్థాన్
ముంబయి కన్నా ముందే చెన్నై.. రాజస్థాన్‌తో 24వ మ్యాచ్ ఆడింది. అప్పుడు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ధోనీసేన 19 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఆల్బీ మోర్కెల్(42), సురేశ్ రైనా(27) ఆదుకున్నారు. లేకపోతే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఛేదనలో రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లలో విజయం సాధించింది. దాంతో చెన్నై 34 బంతులు ఉండగానే ఓటమిపాలైంది. ఇలా మొత్తం నాలుగు సార్లు చెన్నై ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే ఓటమిపాలైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. అయితే, గతరాత్రి ఓటమే అన్నింటికన్నా ఎక్కువ బంతుల తేడాతో ఓడిపోయింది.
- ఇంటర్నెట్‌డెస్క్