కోడి మాంసం ధరకు రెక్కలు
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోడి మాంసం ధరకు రెక్కలు

ఈనాడు - హైదరాబాద్‌: పెళ్లిళ్లు లేవు.. పండగలు లేవు.. వేడుకల సమయం కూడా కాదు.. కాని చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. ఎందుకిలా దూసుకెళ్తున్నాయి అంటే.. ఎండాకాలం అని చికెన్‌ దుకాణదారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగినట్టు సరఫరా లేకపోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయంటున్నారు. రవాణా ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం కూడా కారణమని కోళ్ల పరిశ్రమ నిపుణుడు శ్రీకాంత్‌ చెబుతున్నారు. గత ఆదివారం స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 210 ఉండగా.. ఈ వారం ధర రూ. 260కి తక్కువ లేకుండా అమ్ముడైంది. కొన్ని చోట్ల స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 270, రూ. 280 వరకూ అమ్మారు. లైవ్‌ కూడా గత వారం రూ. 125 ఉండగా.. ఈ ఆదివారం రూ. 160కి తగ్గలేదు. సోమవారం కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 270 దాటుతుందని దుకాణ దారులు చెబుతున్నారు.

ఊరటనిస్తున్న గుడ్లు..

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోడి కూర తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉడకబెట్టిన రెండు గుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే గుడ్ల ధరలు పెరగకపోవడం ప్రజలకు ఊరటే. గతవారం డజను గుడ్ల ధర రూ. 60 ఉండగా.. ఈ వారం కూడా అంతే ఉంది. అయితే గుడ్డు ధర పెరిగినా అది పైసల్లోనే ఉంటుందంటున్నారు. ఎటొచ్చీ చికెన్‌ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. దీంతో కొనుగోళ్లు తగ్గాయని దుకాణదారులు చెబుతున్నారు.

మరింత పెరిగే అవకాశం..

ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఈ కాలంలో కోళ్లు ఎండలకు తట్టుకోలేవని.. వాటి నిర్వహణ భారమని చాలా వరకూ కోళ్ల ఫారాలను ఖాళీ చేస్తారు. చిన్న రైతులు, చిన్నమొత్తంలో పెంపకందారులు ఎండాకాలం నిర్వహణ భారమంటూ కోళ్ల పెంపకాన్ని ఆపేస్తారు. అంతేగాక కోళ్ల దాణాకు అవసరమైన సోయాకేకు ఇతరత్రా ముడిసరకు ధరలు 30-40 శాతం వరకూ పెరిగాయని పెంపకందారులు చెబుతున్నారు. దీనికి తోడు కోళ్లకు తెగుళ్లు కూడా ఎక్కువయ్యాయని.. ఇలా అనేక కారణాలతో కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పరిశ్రమకు చెందిన వారు పేర్కొంటున్నారు. మే నెలలో శుభకార్యాలు మొదలుకానున్న నేపథ్యంలో కోడి ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని