అమెరికాలో ‘టిక్‌టాక్‌’ మూత?
close

తాజా వార్తలు

Published : 13/09/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలో ‘టిక్‌టాక్‌’ మూత?

న్యూయార్క్‌: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ యాజమాన్య హక్కులను విక్రయించేందుకు చైనా ససేమిరా అంటోంది. విక్రయించడం కన్నా ఆ దేశంలో టిక్‌టాక్‌ను పూర్తిగా మూసేయడమే మంచిదని మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో టిక్‌టాక్‌ను కొనసాగించాలా? మూసేయాలా? అన్నదానిపై బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చిన గడువు పొడిగించేది లేదని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15తో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో బైట్‌ డ్యాన్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు అమెరికా విధించిన గడువుకు తలొగ్గి యూఎస్‌ కార్యకలాపాలను ఆదేశానికి విక్రయిస్తే.. అగ్రరాజ్యానికి భయపడినట్లవుతుందని చైనా భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డ్రాగన్‌కు ఇది గొడ్డలిపెట్టుగా మారుతుందనే అభిప్రాయమూ ఉంది. అందువల్ల అమెరికాలో టిక్‌టాక్‌ కార్యకలాపాలు కొనసాగించే కంటే పూర్తిగా మూసివేయడమే మంచిదని బైట్‌ డ్యాన్స్‌కు బీజింగ్‌ చెప్పినట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై చైనా తమకు ఎలాంటి సలహా ఇవ్వలేదని బైట్‌డ్యాన్స్‌ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే, టిక్‌టాక్‌ అమెరికా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సామాజిక మాధ్యమ దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్ కూడా టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతోంది. ఇక ఇప్పటికే ఈ యాప్‌పై నిషేధం ఉన్న భారత్‌లో దీన్ని సొంతం చేసుకునేందుకు రిలయన్స్‌ కూడా టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు  వార్తలొస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని