
తాజా వార్తలు
నిలకడత్వమే వీరి ప్రత్యేకత..!
టీమ్ఇండియాలో అవకాశం కోసం..
లీగ్ ప్రారంభంతో భారత క్రికెట్ రూపురేకలే కాకుండా యావత్ ప్రపంచం ఆటతీరే మారిపోయింది. అందులో ఎలాంటి సందేహం లేదు. 13 ఏళ్లుగా ఈ వేదికపై సత్తా చాటిన ఎంతో మంది యువ క్రికెట్లర్లు ఇప్పుడు తమ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే మన దేశంలోనూ మారమూల ప్రాంతాల్లో దాగున్న యువ ప్రతిభావంతులను బయటి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ టీ20 మెగా లీగ్. హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే సగం టీమ్ఇండియా ఇక్కడి నుంచి తయారైందే. ఈ క్రమంలోనే గత రెండు మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న కొందరు ఆటగాళ్లు టీమ్ఇండియా పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వారెవరో ఎలా ఆడుతున్నారో తెలుసుకుందాం.
సూర్యకుమార్ యాదవ్..
(Photo: Surya Kumar Twitter)
ముంబయి జట్టులో గత మూడేళ్లుగా నమ్మకమైన బ్యాట్స్‌మన్. నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2018లో 512, 2019లో 424, 2020లో 480 పరుగులు చేసి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గెలిపిస్తున్నాడు. ఇటు లీగ్‌లోనే కాకుండా అటు దేశవాళీ క్రికెట్లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. దీంతో టీమ్ఇండియా నుంచి పిలుపు వస్తుందని ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు సైతం అతడిని ఎంపిక చేయకపోవడం దురదృష్టకరం. అయినా, నిరుత్సాహ పడకుండా శ్రమిస్తున్నాడు. అనుకున్నది సాధించేవరకు విశ్రమించకు అనే రీతిలో వేచిచూస్తున్నాడు.
సంజూ శాంసన్..
(Photo: Sanju Samson Twitter)
2013 నుంచీ ఈ టీ20 లీగ్ ఆడుతున్నా సంజూ శాంసన్ ఎప్పుడూ నిరాశపర్చలేదు. 2014లో 339 పరుగులు చేయడంతో 2015లో టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. అప్పుడు జింబాబ్వే పర్యటనలో ఒకే ఒక్క టీ20 ఆడగా మళ్లీ ఈ ఏడాది కివీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈసారి కూడా ఒకే మ్యాచ్‌లో అవకాశం దక్కింది. ఈ విషయం పక్కనపెడితే సంజూ టీ20 లీగ్‌లో రాజస్థాన్ తరఫున గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. 2018లో 441, 2019లో 342, 2020లో 375 పరుగులు చేశాడు. మరోవైపు ఈ సీజన్లో పలు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగించడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. దాంతో రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు టీ20 జట్టులో స్థానం సంపాదించాడు.
మనీష్ పాండే..
(Photo: Manish Pandey Twitter)
హైదరాబాద్ జట్టులో టాప్ ఆర్డర్ కీలకం. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్ లాంటి బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉంటే 70 శాతం పరుగులు పూర్తి చేస్తారు. వారి తర్వాత అత్యంత నమ్మకస్తుడు మనీష్ పాండే. 2014లో తొలిసారి ఈ మెగా లీగ్‌లో సత్తా చాటిన అతడు తర్వాత టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. అయితే, అక్కడ పోటీ ఎక్కువగా ఉండడంతో సరైన అవకాశాలు రాలేదు. కానీ ఏటా తన పరుగుల వేట మాత్రం పెంచుతూనే ఉన్నాడు. 2017 నుంచీ వరుసగా 396, 284, 344, 425 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు.
నితీశ్, శుభ్‌మన్..
(Photo: Nitish Rana Twitter)
కోల్‌కతా టీమ్‌లో ఇద్దరు యువ క్రికెటర్లు టాప్ఆర్డర్లో రాణిస్తున్నారు. వారే నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్. 2016 నుంచీ ఆడుతున్న నితీశ్ మినిమం గ్యారెంటీ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఏటా 300 పైచిలుకు పరుగులు తీస్తూ టీమ్ఇండియా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ గత మూడేళ్ల నుంచే ఈ లీగ్‌లో ఆడుతున్నా ఈ సీజన్లో మెరుగ్గా రాణించాడు. మూడు కీలక మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో ఆదుకొని ప్లేఆఫ్స్ రేసుకు చేరువ చేశాడు. దీంతో అతడు ఎదురు చూస్తున్న టీమ్ఇండియా ఎంపిక సాకారమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టెస్టు జట్లకు ఎంపికయ్యాడు.
(Photo: Shubhman Gill Twitter)
ఇషాన్ కిషన్..
(Photo: Ishan Kishan Twitter)
ముంబయి టీమ్‌లో భవిష్యత్ ఉన్న ఆటగాడిగా ఇషాన్ కిషన్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. 2018లో 275, 2019లో 101 పరుగులు చేసిన అతడు ఈ సీజన్లో విశేషంగా రాణించాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 516 పరుగులు చేసి ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సుల 30 వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ముంబయి వరుసగా రెండో ఏడాది కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అనూహ్యంగా ఈ సీజన్లో రాణించడంపై పలువురు మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరలోనే టీమ్ఇండియాలో చేరతాడని హర్భజన్ లాంటి సీనియర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
-ఇంటర్నెట్‌డెస్క్