close

తాజా వార్తలు

Updated : 20/11/2020 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికాలో నిమిషానికో కరోనా మరణం

బాధితులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
ఆఫ్రికాలో 20 లక్షల కొవిడ్‌ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్ధృతి


వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది. నిమిషానికి ఒకరు కొవిడ్‌తో మరణిస్తున్నారు. బుధవారం నాటికి 2.5 లక్షల మందికి పైగా అమెరికన్లను మహమ్మారి బలి తీసుకుంది. ప్రస్తుతం అక్కడ 45.71లక్షలకు పైగా క్రియాశీల కేసులున్నాయి. రోజూ రికార్డుస్థాయిలో కరోనా బాధితులు వస్తుండటంతో ఆక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సరిపడినంత స్థాయిలో పడకలు లేక.. ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, విశ్రాంతి సముదాయాలు సహా వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ పడకలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.  సరిపడా వైద్య సిబ్బంది లేక బాధితులు అవస్థపడుతున్నారు. రెండు, మూడు వారాల క్రితం.. రోజుకు 70-80 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ బుధవారం ఒక్కరోజే 1.55 లక్షలకుపైగా నమోదయ్యాయని జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు డా.జొనాథన్‌ రీనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా 24 గంటల్లో 1700 మరణాలు సంభవిస్తే.. రెండు నుంచి మూడు వారాలు గడిచేటప్పటికి రోజుకు సుమారు 3 వేల మంది మృతిచెందవచ్చని అంచనా వేశారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 13 లక్షల మందికి పైగా మృతి చెందారు.
పలు దేశాల్లో..        
జపాన్‌లో గురువారం 2,179 కరోనా కేసులు వచ్చాయి. ఒకే రోజు 2 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.  ఆఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ ఖండంలోని 54 దేశాల్లో 48 వేల మందికి పైగా కొవిడ్‌తో మరణించారు. పాకిస్థాన్‌లో గురువారం 2547 కొత్త కేసులు వెలుగుచూడగా, 18 మంది మరణించారు. గల్ఫ్‌ దేశాలకు కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారంలో కొత్తగా నమోదైన కేసుల్లో 60 శాతానికి పైగా ఇరాన్‌లోనే వెలుగుచూసినట్లు తెలిపింది. జోర్టాన్, మొరాకో, లెబనాన్, ట్యునీసియాల్లోనూ ఒకే రోజు సంభవించిన మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 

వాస్తవ గణాంకాలకంటే 6 రెట్లు ఎక్కువ
15 దేశాల్లో ఇప్పటివరకు అధికారికంగా నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే.. మార్చి నుంచి ఆగస్టు నెలల్లో సగటున ఆరు రెట్లు అదనంగా కరోనా వ్యాప్తి జరిగిందని ఆస్ట్రేలియా పరిశోధకులు ఓ అధ్యయనంలో తెలిపారు. ఇటలీలో ఈ ప్రభావం 17 రెట్లు, ఆస్ట్రేలియాలో 5 రెట్లు అదనంగా కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, అమెరికా సహా 11 ఐరోపా దేశాల్లో సుమారు 80 కోట్ల మంది ప్రజలపై ఈ అధ్యయనం చేశారు. 

వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు ప్రచారం
సామాజిక మాధ్యమాల వేదికగా అల్‌ఖైదా, ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థలు వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ ఒకటి వెల్లడించింది. ‘వైరస్‌ ఆఫ్‌ డిస్‌ఇన్ఫర్మేషన్‌’ ఈ మేరకు.. ‘స్టాప్‌ ది వైరస్‌ ఆఫ్‌ డిస్‌ ఇన్ఫర్మేషన్‌’ అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా వైరస్‌ను ఉగ్రవాదులు జీవాయుధంలా ఉపయోగిస్తున్నారని పేర్కొంది.Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన