
తాజా వార్తలు
భారత్‌లో కరోనా: 1637 కేసులు, 38 మరణాలు
దిల్లీ: ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1637కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 38మంది మరణించగా 1466 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 133మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. కేవలం గత 12గంటల్లోనే దేశవ్యాప్తంగా 240కరోనా పాజిటీవ్ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడ కొవిడ్-19 బాధితుల సంఖ్య 320కి చేరగా 12మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఇక్కరోజే 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 87కి చేరింది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది.
భారత్‌లో నమోదైన కేసులు (రాష్ట్రాల వారీగా)
దిల్లీ: కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. మన దేశంలోనూ ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకు భారత్‌లో 1637 కేసులు నమోదు కాగా.. వారిలో 133 మంది డిశ్చార్జి అయ్యారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ 83; అండమాన్ నికోబార్ దీవులు 10; బిహార్ 23; చండీగఢ్ 13; ఛత్తీస్‌గఢ్ 9; దిల్లీ 120 ; గోవా 5; గుజరాత్ 74; హరియాణా 43; హిమాచల్‌ప్రదేశ్ 3; జమ్మూకశ్మీర్ 55; కర్ణాటక 101; కేరళ 241; లద్దాఖ్ 13; మధ్యప్రదేశ్ 47;మహారాష్ట్ర 302; మణిపూర్ 1; మిజోరం 1; ఒడిశా 4; పుదుచ్చేరి 1; పంజాబ్ 41; రాజస్థాన్ 93; తమిళనాడు 124; తెలంగాణ 94; ఉత్తరాఖండ్ 7; ఉత్తర్‌ప్రదేశ్ 103; పశ్చిమబెంగాల్ 26 చొప్పున కేసులు నమోదయ్యాయి.