సవాళ్ల నడుమ నితీశ్‌ ప్రగతి మంత్రం!
close

తాజా వార్తలు

Updated : 30/10/2020 11:52 IST

సవాళ్ల నడుమ నితీశ్‌ ప్రగతి మంత్రం!

ఎన్నికల నేపథ్యంలో బిహార్‌ అభివృద్ధిపై ప్రశ్నలు

పట్నా : బిహార్‌ తొలి దశ ఎన్నికల్లో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓవైపు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే.. రెండు, మూడో దశ ప్రచారంలో అటు ఎన్‌డీఏ, మహాకూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే, ఇప్పటివరకు అభివృద్ధి, సుపరిపాలన పేరుతోనే గడిచిన దశాబ్ద కాలంగా నితీశ్‌ కుమార్‌ రాష్ట్రాన్ని పాలించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గత 15ఏళ్లలో బిహార్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నితీశ్‌ పాలించారని ప్రచారంలో పేర్కొంటున్నారు. నితీశ్‌ కుమార్‌ కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు. అయితే, అభివృద్ధి మంత్రంతో అధికారం చేపట్టిన నితీశ్‌ కుమార్‌లో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆత్మవిశ్వాసం తగ్గినట్లే కనిపిస్తోంది. ఇందుకు ప్రస్తుతం బిహార్‌ ఎదుర్కొంటొన్న సవాళ్లే సాక్షాత్కరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్జేడీ-కాంగ్రెస్‌ హయాంలో బిహార్‌లో ప్రజలు తమ కనీస అవసరాలైన రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటి సౌకర్యాల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తలు కూడా బిహార్‌ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా బిహార్‌ పరిస్థితి అధ్వాన్నంగా మారిన సమయంలోనే నితీశ్‌ కుమార్‌ అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో నితీశ్‌ మీద బిహార్‌ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేవలం కొన్నిరోజుల్లోనే రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి, మంత్రదండం ఆయన‌ దగ్గర ఉందని బిహార్‌ ప్రజలు భావించారు. కానీ, నితీశ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి గొప్ప మార్పేమీ కనిపించలేదు. అంతకుముందున్న పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ మూలాల్లో మాత్రం ఆ మార్పు కనిపించలేదు. అభివృద్ధి, సుపరిపాలన పేరుతో సొంత ఇమేజ్‌ను మాత్రం సాధించగలిగారు కానీ, అభివృద్ధిలో భాగంగా రాష్ట్రానికి పరిశ్రమలు ఎందుకు రావడం లేదనే ప్రశ్నలను మాత్రం ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు.

పరిశ్రమలు ఎందుకు రావడం లేదు..?
ప్రస్తుతం 2020 సంవత్సరంలో రాష్ట్రంలో ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. బిహార్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెబుతున్న నితీశ్‌ ప్రభుత్వం.. ఒకవేళ అభివృద్ధే ఉంటే రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో యువత ఎందుకు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే స్థానిక భౌగోళిక పరిస్థితుల కారణంగానే రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి విముఖత చూపుతున్నాయనే వివరణతో నేటి తరం యువతను నితీశ్‌ ఒప్పించలేకపోతున్నారు.

డబుల్‌ ఇంజిన్‌ వచ్చినా.. మార్పులేని బిహార్‌..!
అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వం) రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని గత ఎన్నికల సమయంలో బాగా ప్రచారం చేశారు. అన్నట్లుగానే కొంతకాలానికి బిహార్‌లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, ఇప్పటికీ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడే ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బిహార్‌ జీడీపీ మరింత తగ్గింది. మిగతా రాష్ట్రాల వృద్ధిరేటు (సీఏజీఆర్‌)7.73 శాతం కన్నా ఎక్కువగా ఉండగా జేడీ(యూ)-భాజపా ప్రభుత్వ హయాంలో ఇది 6.16 శాతంగానే ఉంది.

మెరుగైన ఆర్థిక ప్రగతి బిహార్‌కు సాధ్యమేనా..?

ఆర్థికాభివృద్ధి విషయంలోనూ బిహార్‌ లెక్కలపై అనుమానాలు కలుగుతూనే ఉంటాయి. రాష్ట్ర ఆర్థికవృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. 2019 లెక్కల ప్రకారం, జాతీయ స్థాయిలో 11శాతం వృద్ధిరేటు ఉంటే, బిహార్‌లో మాత్రం 15శాతం ఉంది. కానీ, 70శాతం వ్యవసాయంపై ఆధారపడే బిహార్‌ ప్రజల ఆర్థికస్థితి మాత్రం అంతంతగానే ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బిహార్‌లో వ్యవసాయ ఉత్పాదకత కూడా తక్కువే. వ్యవసాయంలో పెట్టుబడులు వస్తే తప్ప దీనిలో మార్పు కనిపించదు. ఎందుకంటే అక్కడ ఉండే చక్కెర మిల్లులన్నీ మూతబడ్డాయి. దీంతో చెరుకు రైతులు ఉత్తర్‌ప్రదేశ్‌కి వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికితోడు జనపనార, సిమెంట్‌, పేపర్‌ మిల్లుల పరిస్థితి కూడా అంతే. అయితే, నితీశ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించినప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంలో మాత్రం విఫలమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధికి కావాల్సిన గణనీయమైన సామర్థ్యం బిహార్‌కు ఉన్నప్పటికీ వీటికి కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు.

అయితే, రాష్ట్రం ఆశించిన ప్రగతి సాధించకపోవడానికి చారిత్రక అంశాలే కారణమని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు, రాష్ట్రం విడిపోయినప్పటినుంచి బిహార్‌ సమస్యలు ఎదుర్కోవడం ప్రారంభించింది. ముఖ్యంగా ఖనిజ వనరులున్న ప్రాంతాలన్నీ విభజనలో భాగంగా ఝార్ఖండ్‌‌కు వెళ్లిపోయాయి. ఖనిజ వనరులే కాకుండా ఒక్క పారిశ్రామిక నగరం కూడా బిహార్‌లో లేకుండా పోయింది. దీంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రంగానే మిగిలిపోయింది. అందుకే 2005 నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. కానీ, హామీలే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదు. 2015 ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.1.25లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. కానీ, అది కూడా హామీగానే మిగిలిపోయింది. ఇలా ఇప్పటికే పారిశ్రామిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోన్న బిహార్‌కు ప్రస్తుతం కరోనా వైరస్‌ సంక్షోభం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న బిహార్‌ వాసులు సొంత ప్రాంతాలకు చేరుకోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం వంటి అంశాలు కూడా నితీశ్‌ కుమార్‌కు సవాల్‌గా మారాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని