
తాజా వార్తలు
ఇస్లా నవ్వలేదు..
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 108 రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల ఐపీఎల్ కోసం సెప్టెంబర్‌లో యూఏఈకి వెళ్లిన అతడు హైదరాబాద్ టీమ్‌కు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన మెగా లీగ్‌లో వార్నర్ తనదైన బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఈ క్రమంలోనే లీగ్ దశలో చివర్లో వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బెంగళూరును ఓడించి హైదరాబాద్‌ను మూడో స్థానంలో నిలబెట్టాడు.
అప్పుడు దుబాయ్‌కి వెళ్లిన వార్నర్ నవంబర్ 10 ఫైనల్ తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. అయితే ఇక్కడ కరోనా నిబంధనల కారణంగా భారత ఆటగాళ్లతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లూ 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వార్నర్ గురువారం సతీమణి క్యాండిస్, ముగ్గురు కుమార్తెలతో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంబరపడ్డాడు. ‘108 రోజుల తర్వాత నా కుమార్తెలను కలుసుకున్నా. ఇస్లా(మూడో కుమార్తె) ఇంకా కూర్చోలేదు, మా గ్రూప్ ఫొటోలో నవ్వలేదు’ అని పేర్కొన్నాడు. తన కుటుంబం ఎక్కడుంటే అదే సంతోషకరమని వార్నర్ వివరించాడు. మరోవైపు ఇప్పుడే క్వారంటైన్ పూర్తి చేసుకొని తమ కుటుంబసభ్యులను కలుసుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు పలువురు రేపటి నుంచి టీమ్ఇండియాతో ప్రారంభమయ్యే 3 వన్డేల సిరీస్ ఆడనున్నారు. అందులో వార్నర్ కూడా ఉన్నాడు. ఇక తర్వాత ఇరు జట్ల మధ్య 3 టీ20లు, 4 టెస్టుల్లో జరగనున్న సంగతి తెలిసిందే.