శతక్కొటిన గబ్బర్‌‌.. టాప్‌లో దిల్లీ
close

తాజా వార్తలు

Published : 18/10/2020 02:48 IST

శతక్కొటిన గబ్బర్‌‌.. టాప్‌లో దిల్లీ

ఇంటర్నెట్‌ డెస్క్: ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ (101*, 58 బంతుల్లో, 14×4, 1×6) శతకంతో చెలరేగిన వేళ.. దిల్లీ మరో గెలుపు తన ఖాతాలో వేసుకుంది. షార్జా వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ సేన అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో; 6×4, 2×6), అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 4×6), జడేజా (33*, 13 బంతుల్లో, 4×6) మెరిశారు. అనంతరం బరిలోకి దిగిన దిల్లీ అయిదు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మరోవైపు చెన్నై ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

ఛేదనకు దిగిన దిల్లీ ఇన్నింగ్స్‌లో ధావన్‌ ఆటే హైలైట్‌. రెండు లైఫ్‌లు (25 పరుగులు, 80 పరుగుల వద్ద) లభించిన గబ్బర్‌ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. ముచ్చటైన బౌండరీలతో ఇన్నింగ్స్‌ ఆద్యంతం అలరించాడు. అయితే దిల్లీకి గొప్ప ఆరంభమేమి లభించలేదు. దీపక్ చాహర్‌ ధాటికి పృధ్వీ షా (0), అజింక్య రహానె (8; 10 బంతుల్లో; 1×4) 26 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ (23; 23 బంతుల్లో, 1×4, 1×6)తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో శ్రేయస్‌ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన స్టాయినిస్‌ (24; 14 బంతుల్లో, 1×4, 2×6) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోవైపు ధావన్‌ మెరుపు షాట్లతో తన పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో శతకం సాధించాడు. లీగ్‌ కెరీర్‌లో అతడికి ఇదే తొలి సెంచరీ. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌లో విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. అక్షర్‌ పటేల్‌ (21*; 5 బంతుల్లో, 3×6) మూడు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్ రెండు వికెట్లు, సామ్‌ కరన్‌, బ్రావో, శార్దూల్‌ తలో వికెట్ పడగొట్టారు. 

రాణించిన డుప్లెసిస్, రాయుడు 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఖాతా తెరవకముందే సామ్‌కరన్‌ను దేశ్‌పాండే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వాట్సన్‌ (36; 28 బంతుల్లో, 6×4)తో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత దూకుడు పెంచడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో డుప్లెసిస్‌ 39 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. కానీ, తర్వాతి బంతికే వాట్సన్‌ను నోర్జె క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే డుప్లెసిస్‌, ధోనీ (3) కూడా వెనుదిరిగాడు. మరోవైపు రాయుడు భారీ షాట్‌లు ఆడుతూ పరుగులు సాధించాడు. జడేజా (33*, 13 బంతుల్లో, 4×6) కూడా సిక్సర్లతో చెలరేగాడు. 18వ ఓవర్‌ వేసిన దేశ్‌పాండే బౌలింగ్‌లో జడ్డూ బాదిన సిక్సర్‌ స్టేడియం అవతల పడింది. దిల్లీ బౌలర్లలో నోర్జె రెండు వికెట్లు, రబాడ, దేశ్‌పాండే చెరో వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని