
తాజా వార్తలు
తిహార్ జైలులో దిల్లీ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా డిమాండ్లు
దిల్లీ: ఐపాడ్, ఎఫ్ఎం రేడియో, ఇంటి భోజనం.. అదీ మాంసాహారం అయితే మంచిది.. ఇవన్నీ జైల్లో ఉన్న దిల్లీ నేరగాడు నీరజ్ బవానా డిమాండ్లు! జైలులో ఒంటరిగా ఉంచడం వల్ల అతడికి ఊసు పోవటం లేదట. అందుకే తన కాలక్షేపానికి, ప్రశాంతంగా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులకు న్యాయస్థానం ద్వారా నీరజ్ వినతి పత్రం సమర్పించాడు. తాను మాంసాహారినని, జైలులో ఇస్తున్న శాకాహారంతో బరువు తగ్గిపోతున్నానని, తనకు ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని అనుమతించాలని అధికారులను కోరాడు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా రికార్డుల కెక్కిన నీరజ్‌ను ఏప్రిల్ 2015లో పోలీసులు అరెస్టు చేశారు. అతడు ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు.
అయితే నీరజ్ కోరినవి జైలు నిబంధనలకు విరుద్ధమని, తాము ఇందుకు అనుమతించబోమని జైలు సూపరింటెండెంట్ వివరించారు. తిహార్ జైలులో కేవలం శాకాహారం మాత్రమే ఇస్తామని తెలిపారు. జైలులో ఇప్పటికే ఉన్న రేడియోలో అతడు సంగీతం వినవచ్చని అధికారి తెలిపారు. 400 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలులో 17,000 మంది ఖైదీలు ఉంటున్నారు. ముగ్గురు కరడుకట్టిన నేరస్థులను మాత్రం వేర్వేరు జైలు గదుల్లో ఉంచారు. నీరజ్ సహా అండర్‌వరల్డ్ డాన్ ఛోటా రాజన్, రాజకీయవేత్తగా మారిన గ్యాంగ్‌స్టర్ మొహమ్మద్ షహాబుద్దీన్ వీరిలో ఉన్నారు. నీరజ్ 18 ఏళ్లకే తన నేరాల చిట్టాను హరియాణాలో చిన్న దోపిడీతో ప్రారంభించాడు. కరడుగట్టిన నేరగాడు దావూద్ ఇబ్రహీంను ఆదర్శంగా తీసుకున్నాడు. కాంటాక్టు హత్యలు, ముఠా గొడవలు వంటి నేరాలకు పాల్పడ్డాడు. నీరజ్ ఇంతకు ముందు కూడా టీవీ, ఫోన్ కావాలని అడగ్గా.. అప్పుడు కూడా అధికారులు నిరాకరించారు.