దిల్లీ జోరును చెన్నై అడ్డుకునేనా..?
close

తాజా వార్తలు

Updated : 17/10/2020 16:25 IST

దిల్లీ జోరును చెన్నై అడ్డుకునేనా..?

నేడు రాత్రి 7.30 గంటలకు చెన్నై, దిల్లీ మ్యాచ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లో మరోపోరుకు తెరలేవనుంది. సీజన్‌లో భాగంగా 34వ మ్యాచ్‌లో తలపడేందుకు డాడీస్‌ ఆర్మీగా పేరున్న చెన్నై, యువ జట్టు దిల్లీ సిద్ధమయ్యాయి. ఎనిమిది మ్యాచుల్లో ఆరు గెలిచిన దిల్లీ ఉత్సాహంతో ఉండగా.. మూడు విజయాలతో చెన్నై ఆరోస్థానంతో నెట్టుకొస్తోంది. ఈ రోజు రాత్రి 7.30గంటలకు షార్జా వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓ సారి చూద్దాం..

గత రికార్డులు..
ఈ రెండు జట్ల ఇప్పటి వరకూ 22 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 15 మ్యాచుల్లో విజయం సాధించి చెన్నై ముందంజలో ఉంది. దిల్లీ కేవలం 7 మ్యాచుల్లో గెలిచింది. ఈ సీజన్‌లో తలపడ్డ తొలి మ్యాచ్‌లో దిల్లీ 44 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది.

చిన్న బౌండరీలు ఉండే షార్జా మైదానం బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం వంటిది. అయితే.. మంచు ప్రభావం అంతగా లేకపోవడంతో ఈ మధ్య ఛేదన కూడా కష్టమవుతోంది. దీంతో టాస్‌ గెలిచిన జట్టు కెప్టెన్‌ ఎటువైపు మొగ్గు చూపిస్తారన్నది కీలకమే.

దిల్లీకి గాయాల దెబ్బ..
దిల్లీ జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే సీనియర్‌ బౌలర్లు అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ జట్టు నుంచి దూరమయ్యారు. యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ సైతం గాయం కారణంగా దూరమయ్యాడు. ఇంకా కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. తాజాగా ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకున్నాడా..? లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. ఒకవేళ శ్రేయస్‌ ఈ మ్యాచ్‌కు దూరమైతే దిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ బలహీన పడటంతో పాటు ఆ జట్టుపై ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జట్టులో కీలక ఆటగాళ్ల గైర్హాజరు ప్రత్యర్థికి అనుకూలించే అంశం. అయితే.. పాయింట్ల పట్టికలో టాప్‌2లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. దిల్లీ బౌలర్లు నోర్జ్‌, రబాడ అద్భుతంగా రాణిస్తున్నారు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రహానె రాణించాల్సిన అవసరం ఉంది. చెన్నై ఓపెనర్లను కట్టడి చేస్తే దిల్లీకి మరో విజయం దాదాపు ఖాయమైనట్లే. 

ధోనీ.. వ్యూహమేంటో..?
వరుస ఓటములతో విసిగిన చెన్నై జట్టుకు గత మ్యాచ్‌లో గెలుపు కాస్త ఊరట కలిగించింది. ఆ మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ను ఓపెనింగ్‌లో దింపి ధోనీ ఫలితం రాబట్టాడు. రాయుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌ లోపాలతో ఓడిన చెన్నైకి దాదాపు ఆ సమస్య తీరినట్లే కనిపిస్తోంది. అయితే చెన్నై ఈసారి ఎదుర్కోబోయేది ప్రమాదకర ఫాస్ట్‌బౌలర్లున్న దిల్లీని. గత మ్యాచ్‌లో గంటకు 150కి.మీ పైగా వేగంతో బౌలింగ్‌ చేసి ప్రత్యర్థి రాజస్థాన్‌ను దిల్లీ బౌలర్లు ఎంతలా ఇబ్బంది పెట్టారో మనం చూశాం. అయితే అలాంటి బంతులకు చెన్నై బ్యాట్స్‌మెన్ ఎదురు నిలిచి పరుగులు సాధించాల్సి ఉంది. బౌలింగ్‌లో సమష్టి కృషి చేస్తున్న ధోనీసేన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ధోనీ ఇప్పుడిప్పుడే కాస్త లయ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. అతని నుంచి హెలికాప్టర్‌ ఇన్నింగ్స్‌ వస్తే అభిమానులకు తనివి తీరుతుంది. ఏదేమైనా.. లీగ్‌ చరిత్రలో ఘనమైన రికార్డు ఉన్న చెన్నై ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది.

జట్లు(అంచనా)
దిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్యా రహానె, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), మార్కస్ స్టాయినిస్, అలెక్స్ కేరీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడ, నోర్జ్‌

చెన్నై: షేన్ వాట్సన్, సామ్ కరన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని