close
Array ( ) 1

తాజా వార్తలు

కనిపించని నాటి దేవేంద్రుడి మార్క్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి విజయం సాధించినా భారీ గెలుపు రాకపోవడం ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు మింగుడు పడని అంశంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 48 సీట్లకు గాను భాజపా-సేన కూటమి 41 సీట్లను గెలుచుకుంది. దీంతో భాజపా శ్రేణుల్లో దేవేంద్ర పేరు మార్మోగిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధినేత అమిత్‌షాలకు దేవేంద్రపై గురి కుదిరింది. దీంతో ఆయనకు తాజా ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అభ్యర్థుల ఎంపిక నుంచి సేనతో సీట్ల సర్దుబాటు వరకు ఫడణవీస్‌ అన్నీ తానై వ్యవహరించారు. అయితే ఫలితాల్లో భాజపా కేవలం 100+ సీట్లను మాత్రమే సాధించింది. శివసేనతో ముందస్తు పొత్తు ఉండటంతో కూటమి విజయం సాధించింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నట్టు ప్రభంజనం రాలేదు. మహారాష్ట్రలో పార్టీ సాధించిన ఫలితాలు భాజపా అగ్రనాయకత్వాన్ని నిర్ఘాంతపరిచాయి. ఎందుకిలా జరిగింది? అన్న దానిపై పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. దేవేంద్ర ఫడణవీస్‌ పేలవమైన ప్రదర్శనకు పలు కారణాలివీ..

వ్యవసాయరంగంలో సంక్షోభం..
రాష్ట్రంలో విదర్భ, మరఠ్వాడా, పశ్చిమ ప్రాంతాల్లో చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాటు గ్రామీణ రంగం నిర్లక్ష్యానికి గురైంది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువ కావడం.. వీటి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో గ్రామీణ రంగంలో వ్యతిరేకత ప్రబలింది.

పార్టీనేతలను పక్కనబెట్టడం..
లోక్‌సభ ఎన్నికల్లో దేవేంద్ర ఫడణవీస్‌ సాధించిన విజయాలతో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినాయకత్వం ఫడణవీస్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది.  దేవేంద్ర వ్యతిరేక వర్గీయులుగా పేరుపడ్డ ఏక్‌నాథ్‌ ఖడ్సే, వినోద్‌ తవ్‌డే, చంద్రశేఖర్‌ బవనకులేలకు సీట్లు ఇవ్వలేదు. దీంతో కొన్ని చోట్ల సీటు దక్కని సిట్టింగులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగడం పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టింది.

పారిశ్రామికాభివృద్ధి తగ్గడం..
మహారాష్ట్రలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆర్థికరంగం నెమ్మదించడంతో పారిశ్రామికాభివృద్ధి పడిపోయింది. ఫలితంగా అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. ప్రత్యేకించి వాహన రంగంపై ఆధారపడిన వేలాది మందికి ఉపాధి కరవైంది. ఈ రంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమైంది.

పవార్‌పై కేసులు.. సానుభూతి
మరాఠా రాజకీయాల్లో ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ది ప్రత్యేకమైన స్థానం. ఆయన బంధువు అజిత్‌ పవార్‌తో పాటు పవార్‌పై ఈడీ కేసులు పెట్టడంతో వారిపై ఓటర్లలో సానుభూతి పెరిగింది. దీంతో ఎన్‌సీపీ గతంలో కంటే ఓట్లను, సీట్లను పెంచుకుంది. విపక్ష రాజకీయ నాయకులపై కేసులు పెట్టడంతో పరోక్షంగా సానుభూతి పవనాలు ఏర్పడేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.

ఫిరాయింపుదార్లకు పట్టం
భాజపాలోకి ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నుంచి భారీగా ఫిరాయింపులు పెరిగాయి. సతారా లోక్‌సభ ఎంపీ ఉదయ్‌రాజ్‌ భోస్లే భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీగా గెలిచి నెలలు తిరగకుండానే భాజపాలోకి ఫిరాయించడంపై ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమైంది. తాజా ఉప ఎన్నికలో ఆయన ఓటమి పాలవడం గమనార్హం. భాజపా తరఫున అనేక మంది ఫిరాయింపుదారులకు సీట్లు కేటాయించడం కూడా పార్టీ విజయవకాశాలపై ప్రభావం చూపించింది.

వరదలు..
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వచ్చిన వరదలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. వరద బాధితులను ఆదుకునేందుకు చేపట్టిన సహయక చర్యలు సరిగ్గా సాగలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగంపై బాధితులు నిరసన వ్యక్తం చేశారు. 

ఆకట్టుకోని ఆర్టికల్‌ 370 రద్దు..
జమ్ముకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దుపై భాజపా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. అయితే గ్రామీణ ఓటర్లను ఈ ప్రచారం ఆకట్టుకోలేకపోయింది. వీటితో పాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో భూమిని సేకరించడంపై రైతాంగంలో భారీ ఎత్తున నిరసన వ్యక్తమైంది. వీటిని అర్థం చేసుకొని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడం కూడా భాజపా కూటమి పేలవమైన ప్రదర్శనకు కారణమైంది.

శివసేన ప్రచారం..
లోక్‌సభ ఎన్నికల వరకు ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న శివసేన రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేది. కొంకణ్‌లో రిఫైనరీ స్థాపన అంశంలో సీఎం వైఖరిని తప్పుబట్టింది. ఈ విమర్శలు సేనకు తాజా ఎన్నికల్లో సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ఉపకరించాయి. అయితే అదే విమర్శలు ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు ఏర్పడేందుకు కూడా అనుకూలించడాన్ని విస్మరించలేం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.