close

తాజా వార్తలు

Updated : 02/11/2020 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేను రిటైర్‌ అవుతున్నాననుకున్నారేమో: ధోనీ

జెర్సీల బహూకరణపై చెన్నై కెప్టెన్‌ స్పందన

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరిగిన పలు మ్యాచ్‌ల్లో చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఆటగాళ్లకు తన సంతకం చేసిన జెర్సీలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మహీ.. బహుశా వాటిని తీసుకున్న వాళ్లు తాను రిటైర్‌ అవుతున్నానేమో అనుకొని ఉండొచ్చని చెప్పాడు. ఆదివారం పంజాబ్‌ను చిత్తుగా ఓడించాక ధోనీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇది తమకు కష్టతరమైన సీజన్‌ అని, తమ శక్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయామని వాపోయాడు. టోర్నీలో పలుమార్లు తప్పిదాలు చేశామని ఒప్పుకున్నాడు. ఇక గత నాలుగు మ్యాచ్‌ల్లోనే తమ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్లు వివరించాడు. ఎప్పుడైనా అపజయాలతో వెనుకబడితే మళ్లీ పుంజుకోవడం కష్టమని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రతీఒక్కరూ వ్యక్తిగతంగా రాణించాలని ధోనీ సూచించాడు. 

ఇక తమ జట్టులో స్వల్ప మార్పులు చేయాల్సి ఉందని, రాబోయే పదేళ్లకు మెరుగైన జట్టుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నాడు. ఇప్పుడు కొత్త వాళ్లకి అవకాశం ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే జట్టును నూతనంగా తీర్చిదిద్దుతామని, వచ్చే సీజన్‌లో మరింత దృఢంగా తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ సీజన్‌లో ముంబయి ఒక్కటే అత్యుత్తమంగా ఆడిందని మెచ్చుకున్నాడు. అనంతరం తాను జెర్సీలు బహూకరించడంపై స్పందించిన చెన్నై సారథి.. అలా చేయడం ద్వారా ఆయా ఆటగాళ్లు తాను రిటైర్‌ అవుతున్నట్లు భావించారేమోనని పేర్కొన్నాడు. ఇక రుతురాజ్‌ బాగా ఆడాడని, తొలుత అతడికి కరోనా సోకడంతో ఇబ్బంది పడ్డాడని చెప్పాడు. దాంతో సరైన ప్రాక్టీస్‌ లభించలేదని వివరించాడు. ఈ నేపథ్యంలోనే తాము వాట్సన్‌, డుప్లెసిస్‌ని ఆడించామని చెప్పాడు. ఇక చివరగా తర్వాతి సీజన్‌పై స్పందిస్తూ దానికి కొద్ది నెలలే సమయం ఉందని.. లాక్‌డౌన్‌ లేకపోవడంతో తమ నైపుణ్యాలపై మరింత శ్రద్ధ పెడతామని చెప్పాడు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని