close

తాజా వార్తలు

Published : 30/10/2020 08:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వల్ల రుతురాజ్‌ను అంచనా వేయలేకపోయాం 

రుతురాజ్‌పై చెన్నై కెప్టెన్‌ ప్రశంసలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయామని చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అన్నాడు. గతరాత్రి కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో రుతురాజ్‌(72) అర్ధ శతకంతో రాణించగా జడేజా(31*) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. దీంతో కోల్‌కతా తప్పక గెలవాల్సిన పోరులో ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ధోనీ రుతురాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే చివర్లో తమకు కలిసి వచ్చిందని చెప్పాడు. ఈ క్రెడిట్‌ అంతా ఆటగాళ్లదేనని, ఈ సీజన్‌లో జడేజా అద్భుతంగా ఆడుతున్నాడని తెలిపాడు. తమ జట్టులో డెత్‌ ఓవర్లలో అతనొక్కడే బాగా రాణిస్తున్నాడని, అతడికి సరైన జోడీ లేదని పేర్కొన్నాడు. జడేజాకు సరైన బ్యాట్స్‌మన్‌ తోడైతే చెన్నైకు కలిసి వచ్చేదని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

అలాగే ఎవరికైతే అవకాశాలు రాలేదో వారిని ఆడించాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ క్రమంలోనే రుతురాజ్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడంతో తానేంటో నిరూపించుకున్నాడని అన్నాడు. రుతురాజ్‌ ఇక్కడికి వచ్చాక కరోనా బారిన పడ్డాడు. దాంతో అతడి సామర్థ్యాన్ని అంచనా వేసే సమయం మాకు లభించలేదు. అతనెక్కువ మాట్లాడడు. ఒకసారి బరిలోకి దిగితే ఒత్తిడిని తట్టుకోవాలి. అతడికి తొలి మ్యాచ్‌లో అవకాశం ఇచ్చినప్పుడు డకౌట్ అయ్యాడు. ఒక ఆటగాడిని అంచనా వేయాలంటే ఒక బంతి సరిపోదు. ఇప్పుడు తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాడు. జట్టుగా ఇప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మాకు ప్లేఆఫ్స్‌ చేరే పరిస్థితి లేకపోయినా, రాబోయే సీజన్లలో సరైన ఆటగాళ్లు మాకున్నారు’ అని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, ఈ ఓటమితో కోల్‌కతా అవకాశాలకు గండిపడింది. ఇప్పటికి 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. అదిప్పుడు తదుపరి దశకు చేరుకోవాలంటే ఆఖరి మ్యాచ్‌ గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, అదంత తేలిక కాదు. 




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని