
తాజా వార్తలు
దయచేసి అతడి రికార్డుల్ని పరిశీలించండి: భజ్జీ
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనకు ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. ప్రతి ఏడాది రంజీ సీజన్లో, టీ20 క్రికెట్ లీగ్‌లో సత్తాచాటుతున్నప్పటికీ అతడిని టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో తెలియట్లేదని అన్నాడు. వ్యక్తులని బట్టి ఎంపిక నిబంధనలు మారుతుంటాయని భజ్జీ విమర్శించాడు.
‘‘భారత జట్టులో చోటు సంపాదించడానికి సూర్యకుమార్ ఇంకేం చేయాలో నాకు తెలియట్లేదు. ప్రతి ఏడాది రంజీ సీజన్లో, టీ20 క్రికెట్ లీగ్‌లో అతడు రాణిస్తున్నాడు. వ్యక్తులను బట్టి నిబంధనలు ఉంటాయేమో! అతడి రికార్డుల్ని పరిశీలించాలని టీమిండియా సెలక్టర్లని అభ్యర్థిస్తున్నాను’’ అని భజ్జీ ట్వీటాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 క్రికెట్ లీగ్‌లో సూర్యకుమార్ ముంబయి తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.44 సగటుతో 283 పరుగులు చేశాడు. దీనిలో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. గత సీజన్లలోనూ ముంబయి సాధించిన విజయాల్లో సూర్యకుమార్ కీలకపాత్ర పోషించాడు.
టీమిండియాకు సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడంపై వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా స్పందించాడు. ‘‘లీగ్‌లో ముంబయి తరఫున కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ ఎంపిక కాకపోవడం బాధ కలిగించేది. అయితే ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్, వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, శాంసన్ జట్టులో ఉండటంతో శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండేను సూర్యకుమార్ దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని ట్వీటాడు. లీగ్‌లో ఇప్పటివరకు 96 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 1831 పరుగులు సాధించాడు.