close

తాజా వార్తలు

Published : 14/11/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి గమనించాం’

వచ్చే జనవరి వరకు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్

హైదరాబాద్‌: కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా వచ్చే మూడు నెలలు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ కోఠిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ నెలలో వివాహాలు చాలా ఉన్నాయని.. అయితే వచ్చే మూడు నెలల వరకు వివాహాలే కాకుండా ఇతరత్రా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయని.. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ వస్తుందని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత 8 నెలలుగా పాటిస్తూ వస్తున్న అవే కఠిన నియమాలను వచ్చే జనవరి వరకు ఆచరించాలని సూచించారు.

‘‘దీపావళి, వివాహాలు, శుభకార్యక్రమాల సందర్భంగా విస్తృతంగా షాపింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశాన్ని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సూచిస్తున్న అన్ని సూచనలను ఎక్కువ శాతం ప్రజలు పాటిస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో కొంత నిర్లక్ష్య వైఖరిని కూడా గమనించాం. మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో కొనే వారు, అమ్మే వారు ఇద్దరూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. మాస్కులు ధరించిన వారు సైతం సరైన పద్ధతిలో ధరించడం లేదు. జనం రద్దీ ఉన్న చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని డా.శ్రీనివాస్‌ తెలిపారు.

‘‘తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తరఫున అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య శాఖ సూచించిన నియమాలు పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదు. ఇప్పటివరకు లక్షలాది మంది ప్రజలు కొవిడ్ బారిన పడకుండా కాపాడుకుంటూ వచ్చాం. ప్రపంచ వ్యాప్తంగా సెకెండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ అని మరోసారి కరోనా విజృంభణ గురించి వింటున్నాం. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో వచ్చేలా మన చేతులారా చేసుకోకూడదు. మన ప్రవర్తనను మనమే మార్చుకుందాం. దీపావళి పండగను దీపాలతో జరుపుకొందాం. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాణసంచాకు దూరంగా ఉందాం’’ అని వివరించారు.
   



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన