డ్రగ్స్‌ ముఠా.. పక్కా లోకల్‌!
close

తాజా వార్తలు

Published : 24/06/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ ముఠా.. పక్కా లోకల్‌!

కరోనా వేళ కొత్త మార్గాల్లో దందా


మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ ఇటీవల పట్టుబడిన నిందితులు
ఈనాడు, హైదరాబాద్‌: మాదక ద్రవ్యాలంటే అందరికీ గుర్తుకొచ్చేది నైజీరియన్లే. ప్రస్తుతం నగరంలో గట్టి నిఘా కొనసాగుతుండడంతో వారు తమ పంథాను మార్చుకున్నారు. వేరే నగరాల్లో తలదాచుకుంటూ.. స్థానికులతో ఈ దందాను కొనసాగిస్తున్నారు. మత్తుకు అలవాటు పడిన వారే.. ఇప్పుడు వారికి వ్యాపార వనరుగా మారిపోయారు. మాదకద్రవ్యాల ముఠాల చిరునామాలు సైతం మారిపోయాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లాంటి విలాసమైన ప్రాంతాలు కాకుండా బస్తీల్లో గుట్టు చప్పుడుకాకుండా ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలో దొరికిన మూడు ముఠాల చిరునామాలన్నీ బస్తీల్లోనే ఉన్నాయి. అలాగే కొకైన్‌, హెరాయిన్‌, ఎండీఎఏ, ఎల్‌ఎస్‌డీ, గంజాయిని విక్రయించే ముఠాలు.. తాజాగా ‘హషిష్‌ ఆయిల్‌’ (గంజాయి ఆకుల నుంచి ఈ ద్రవాన్ని తీసి సిగరెట్లపై పూసి పొగ తాగుతుంటారు)ను అమ్ముతున్నారు. కరోనా వేళ.. శానిటైజర్‌ లాగా సరఫరా చేసి యువతను మత్తులో ముంచుతున్నారు.

అలవాటైన వారే..

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మాదకద్రవ్యాలతో పట్టుబడిన వారంతా..ఆ మత్తుకు బానిసైన వారేనని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సహాయ పర్యవేక్షకులు అంజిరెడ్డి చెబుతున్నారు. గట్టి నిఘా ఉండడంతో నైజీరియన్లు నేరుగా రంగంలోకి దిగకుండా, ఇప్పటికే డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారినే సరఫరాదారులుగా ఎంచుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు. వారికి కావాల్సినంత తీసుకొని, వేరే వ్యక్తులకు చేరవేస్తూ డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నైజీరియన్లు గోవా, ముంబై, దిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉంటూ, చాకచక్యంగా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని అంజిరెడ్డి తెలిపారు.

* ఇటీవల ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం మూడు ముఠాలను పట్టుకుంది.

* మే 14న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యూసుఫ్‌గూడ నివాసి సాయి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని 2.83 కిలోల చరాస్‌తో పాటు 25 గ్రాముల హషిష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి బానిసగా మారి.. వ్యాపారి అవతారమెత్తి అధికారులకు దొరికిపోయాడు.

*● జూన్‌ 21న ఎస్‌ఆర్‌నగర్‌ సమీపంలోని మధురానగర్‌లో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌, 25 గ్రాముల హషిష్‌ ఆయిల్‌, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మధురానగర్‌కు చెందిన భరత్‌ టుక్రాల్‌, బల్కంపేటకు చెందిన రాణాప్రతాప్‌, బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌ బస్తీకి చెందిన ఫెరోజ్‌ అహ్మద్‌లు మత్తుకు బానిసలుగా మారి..ఇతరులకు అందజేసే క్రమంలో ఎక్సైజ్‌ అధికారులకు పట్టుబడ్డారు. వీరేగాక పరారీలో ఉన్న మరో నలుగురి కోసం అధికారులు గాలిస్తున్నారు.

*● జూన్‌ 22న ఎస్‌ఆర్‌నగర్‌లో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులకు బోరబండకు చెందిన అఖిల్‌ ఆదిత్య, జి.ఫణి మాదకద్రవ్యాలతో పట్టుబడ్డారు. వారి నుంచి 2.1 కేజీల హషిష్‌ ఆయిల్‌, 410 గ్రాముల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని