close

తాజా వార్తలు

Updated : 06/08/2020 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా‌రెడ్డి కన్నుమూత

చేగుంట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అది ఇన్‌ఫెక్షన్‌ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌నకు చెందిన రామలింగారెడ్డి 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దొమ్మాట నియోజకవర్గం నుంచి తెరాస తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 సార్వత్రిక ఎన్నికలలోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామలింగారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

సోలిపేటతో ఎంతో అనుబంధం ఉంది: కేసీఆర్‌
రామలింగారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. 

చంద్రబాబు సంతాపం..
ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శాసనసభ్యుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎమ్మెల్యే మరణం తెలంగాణకు తీరని లోటు...
రామలింగారెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సోలిపేట మృతి తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన మృతి ఉమ్మడి మెదక్‌ జిల్లాకు తీరని లోటన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం నిత్యం పరితపించిన నాయకుడని కొనియాడారు. ఉద్యమ సహచరుడిగా ఆయనతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు.  

రామలింగారెడ్డి చాలా నిరాడంబరుడు..
సోలిపేట మృతిపట్ల మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే ఆకస్మిక మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. పత్రికా రంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వ, నిరాడంబరుడు రామలింగారెడ్డి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి కీలకపాత్ర పోషించారని చెప్పారు. రామలింగారెడ్డి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దొమ్మాట, దుబ్బాక నియోజక వర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఆయన మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు తీరని లోటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మంత్రులు కొనియాడారు. ఎమ్మెల్యే ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.   

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని