
తాజా వార్తలు
‘కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?’
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిమిత్తం దిల్లీ నుంచి భాజపా అగ్రనేతలు హైదరాబాద్ వస్తే సీఎం కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. నగరంలోని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో రఘునందన్ మాట్లాడారు. తెరాస నేతలు హైదరాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా దిల్లీ నుంచి కేంద్ర మంత్రులెందుకు వస్తున్నారని ప్రశ్నించాల్సిన అవసరం ఏముందన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో ఆ జిల్లా తెరాస నేతలే కాకుండా రాష్ట్ర మంత్రులూ ప్రచారం నిర్వహించారన్నారు. ఆనాడు మంత్రులు ప్రచారం చేస్తే లేని ఇబ్బంది.. ఇవాళ దిల్లీ నుంచి కేంద్ర మంత్రులు వస్తే ఏంటని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాజపా నేతలెవరూ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడలేదని చెప్పారు. తెరాస నేతలే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు చేతనైతే ప్రజలకు ఏం చేశారో చెప్పాలి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదన్నారు. దిల్లీలో ఉష్ణోగ్రతలు సున్నాకు చేరువ కావడంతోనే అక్కడి ప్రజలు వణుకుతున్నారని.. అంతేకానీ కేసీఆర్ను చూసి కాదని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో సరిపడా సీట్లు గెలుచుకొని భాజపా మేయర్ పీఠం దక్కించుకుంటుందని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు.