ఆఖరి ఓవర్‌పై ధోనీ క్లారిటీ
close

తాజా వార్తలు

Updated : 18/10/2020 14:31 IST

ఆఖరి ఓవర్‌పై ధోనీ క్లారిటీ

షార్జా: చెన్నై చేతుల్లో నుంచి మరో మ్యాచ్‌ జారిపోయింది. శనివారం రాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లక్ష్య ఛేదనలో ఉన్న ప్రత్యర్థి జట్టుకు ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో శిఖర్‌ ధావన్ ఉన్నాడు‌. అతను భారీ సిక్సర్లు కొట్టలేడు. మ్యాచ్‌ గెలిచేయొచ్చు అనుకున్నారంతా. కానీ.. అలా జరగలేదు. మరో ఎండ్‌లో ఉన్న అక్షర్‌ పటేల్‌ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. బ్రావో వేయాల్సిన ఓవర్‌ జడేజా వేస్తే.. ధావన్‌ కొట్టాల్సిన సిక్సర్లు అక్షర్‌పటేల్‌ కొట్టాడు. ఇద్దరు ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉన్న సమయంలో.. పైగా అది మ్యాచ్‌ను నిర్ణయించే ఆఖరి ఓవర్‌లో లెఫ్టార్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ను బౌలింగ్‌కు దింపడమే‌ ఓటమికి కారణమని విమర్శలు వచ్చాయి. అయితే.. దీనిపై కెప్టెన్‌ ధోనీ స్పందించాడు. ఆఖరి ఓవర్‌ జడేజాకు ఇవ్వడానికి గల కారణాలు వెల్లడించాడు.

‘ఆఖరి ఓవర్‌ వేయాల్సిన సమయంలో బ్రావో మైదానంలో లేడు. అతను ఫిట్‌గా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతకు ముందే బ్రావోతో మాట్లాడాను. డ్రెస్సింగ్‌రూమ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ మైదానంలోకి వద్దామన్న ఉద్దేశంతో బ్రావో మైదానం వీడాడు. అయితే.. బౌలింగ్‌ వేసేందుకు సిద్ధంగా లేనని తర్వాత చెప్పాడు. ఆ సమయంలో జడేజా, కరణ్‌శర్మ ఇద్దరికే చెరో ఓవర్‌ మిగిలి ఉంది. అందుకే.. రిస్క్‌ అని తెలిసినా చివరి ఓవర్‌ జడేజాతో వేయించాల్సి వచ్చింది’ అని ధోనీ వివరించాడు.
‘కీలకమైన క్యాచ్‌లు వదిలేయడం వల్లే మ్యాచ్‌ను కోల్పోయాం. అయితే ధావన్‌ ఇన్నింగ్స్‌ను తక్కువ చేయడానికి ఏం లేదు. అతను మేం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌ కంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ నెమ్మదించి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఆఖర్లో సామ్‌ కరన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతనిలో ఆత్మవిశ్వాసం కనిపించింది’ అని చెన్నై కెప్టెన్‌ ధోనీ పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని