మమత ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మమత ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

కోల్‌కతా: తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఒకరోజు పాటు ఎలాంటి ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. ఈరోజు రాత్రి 8 నుంచి 24 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేపట్టవద్దని సూచించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత ప్రాతిపదికన మమతా బెనర్జీ ఓట్లు అడుగుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 3వ తేదీన హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌ ప్రాంతంలో మమతా బెనర్జీ పర్యటించారు. ఆ సమయంలో ఓ వర్గాన్ని ప్రస్తావించిన దీదీ.. కొన్ని పార్టీలు మైనారిటీ ఓటర్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి సమయంలో మైనారిటీ ఓటర్లందరూ ఏకం కావాలని మమత  పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై కేంద్రమంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ నేతృత్వంలోని భాజపా బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. 48గంటల్లో వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులు జారీచేసింది. దీనిపై మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. పరిశీలించిన అనంతరం చర్యలకు ఉపక్రమించిన ఎన్నికల సంఘం.. 24గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.

పశ్చిమబెంగాల్‌లో గత శనివారం జరిగిన నాలుగోవిడత పోలింగ్‌ హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌) బలగాలు కోచ్‌బిహార్‌ జిల్లా సితాల్‌కుచి నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్‌ కేంద్రం వెలుపల కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై  అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష భాజపా దుమ్మెత్తి పోసుకున్నాయి. మరోవైపు ఐదో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ ఘటనపై స్పందిస్తూ... ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రేరేపించడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. కోచ్‌బిహార్‌లో కేంద్ర బలగాలను ముట్టడించాలని ఆమె పిలుపునిచ్చారని అందువల్లే అక్కడ హిసం చోటుచేసుకుందని అన్నారు.  17న ఐదో విడత పోలింగ్‌ నేపథ్యంలో... ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 24 గంటలపాటు ప్రచారానికి దూరంగా ఉంచడం రాజకీయ చర్చకు తావిస్తోంది.

ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగాయి. మిగిలిన 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 17న బెంగాల్‌లో ఐదో దశలో భాగంగా 44 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని