
తాజా వార్తలు
మా ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుంది: రౌత్
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం, లేదా నాయకులు ఏ దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు భయపడేది లేదని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ స్పష్టం చేశారు. రాజకీయంగా ప్రతీకారంతోనే తమ పార్టీ ఎమ్మెల్యే సర్నాయక్ నివాసంపై ఈడీ దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ మేరకు సంజయ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని కొన్ని ప్రధాన పార్టీలు మాపై ఒత్తిళ్లు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే 25 ఏళ్ల వరకు అధికారంలోకి వస్తామనే కలల్ని మరచిపోవాలి. ఒత్తిళ్లను మీరు ఈ రోజు ప్రారంభించారు. వాటిని ఎలా ముగించాలో మాకు తెలుసు’ అని రౌత్ పరోక్షంగా భాజపాను ఉద్దేశించి హెచ్చరించారు.
’దర్యాప్తు ఏజెన్సీలు ఏవైనా రాజకీయ పార్టీకి శాఖలా పనిచేయకూడదు. ఈడీ దర్యాప్తులకు రాష్ట్రంలో ఎలాంటి నిషేధం లేదు. ఎమ్మెల్యే సర్నాయక్పై ఉన్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నవారిని మానసికంగా వేధించాలని అనుకుంటున్నారు. ఇలాంటి చర్యలు మీకే తిప్పికొడతాయి. ఈడీ లేదా సీబీఐ ఏదైనా సరే మా ప్రభుత్వం వాటి ఒత్తిళ్లకు తలొగ్గేది ఉండదు. మీరు ఎన్ని నోటీసులు పంపించినా, ఎన్ని రైడ్స్ చేసినా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుంది. మహారాష్ట్రలో సత్యమేవ జయతే నినాదం విజయం సాధిస్తుంది’ అని రౌత్ తెలిపారు. గతేడాది ఎన్సీపీ నేత శరద్‌పవార్‌కు ఈడీ పంపిన నోటీసుల గురించి ప్రశ్నించగా.. ‘నోటీసులు కాదు.. అవసరమైతే అరెస్టులు చేసుకోమనండి’ అని బదులిచ్చారు. శివసేన ఎమ్మెల్యే సర్నాయక్కు మనీలాండరింగ్ కేసులో సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ ఈడీ మంగళవారం ఆయన నివాసంపై దాడులు నిర్వహించింది.