close

తాజా వార్తలు

సీనియర్స్‌ ఛాంప్‌ఎస్పీ కళాశాల

* జూనియర్స్‌ విజేత భవన్స్‌ శ్రీ అరబిందో

* టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు మహిళల ట్రోఫీ

* ముగిసిన ఈఎస్‌ఎల్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ క్రికెట్‌ టోర్నీ

అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలు.. అబ్బురపరిచే బౌలింగ్‌ నైపుణ్యాలు.. శతకాలతో బ్యాట్స్‌మెన్‌ చెలరేగితే.. వికెట్లతో బౌలర్లు విజృంభించారు. గత కొన్ని వారాలుగా ఆటగాళ్ల ప్రదర్శనలకు వేదికగా నిలిచి.. అభిమానులను అలరించిన స్ప్రైట్‌ ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ (ఈఎస్‌ఎల్‌) హైదరాబాద్‌ ప్రాంతీయ క్రికెట్‌ టోర్నీ శుక్రవారం ముగిసింది. సీనియర్స్‌ విభాగంలో సర్దార్‌ పటేల్‌ (ఎస్పీ) కళాశాల (సికింద్రాబాద్‌) విజేతగా నిలవగా.. జూనియర్స్‌లో భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్‌ కళాశాల (సైనిక్‌పురి), మహిళల్లో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జూనియర్‌ కళాశాల (కమ్మదనం) ట్రోఫీలు సొంతం చేసుకున్నాయి. ఈ విజేతలు హైదరాబాద్‌ హీరోస్‌ తరపున ఈఎస్‌ఎల్‌ ఫైనల్స్‌లో పోటీపడనున్నారు.  

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌

అనిరుధ్‌ (63; 4/31) ఆల్‌రౌండ్‌ జోరుకు షేక్‌ సోహైల్‌ (94 నాటౌట్‌; 51 బంతుల్లో 10×4, 4×6) అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన తోడవడంతో పీర్జాదిగూడలోని బాబూరావు సాగర్‌- ఎ మైదానంలో జరిగిన సీనియర్స్‌ ఫైనల్లో సర్దార్‌ పటేల్‌ కళాశాల 86 పరుగుల తేడాతో భవన్స్‌ వివేకానంద డిగ్రీ కళాశాల (సైనిక్‌పురి)పై గెలిచింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్పీ కళాశాల 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. సోహైల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి అనిరుధ్‌ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అర్ధశతకం తర్వాత అనిరుధ్‌ వెనుదిరిగినా.. సోహైల్‌ మాత్రం తగ్గలేదు. శతకం చేసేలా కనిపించిన అతను మూడంకెల స్కోరుకు ఆరు పరుగుల దూరంలో ఆగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లలో సూర్యతేజ (2/30), భరత్‌ (2/32) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో భవన్స్‌ వివేకానంద జట్టు 17.4 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో మెరిసిన అనిరుధ్‌ బంతితోనూ విజృంభించి నాలుగు వికెట్లు తీశాడు. అతనితో పాటు రతన్‌తేజ (3/14) కూడా రాణించి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.

మెరిసిన ఇషాన్, రాహుల్‌: జూనియర్స్‌ తుదిపోరులో భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్‌ కళాశాల 10 వికెట్ల తేడాతో ఐ- క్లాస్‌ సీడీఆర్‌ జూనియర్‌ కళాశాలను చిత్తుచేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐ- క్లాస్‌ సీడీఆర్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆర్యన్‌ (35), కార్తీక్‌ (25) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఆఖీబ్‌ (2/19), సాహిల్‌ (2/36) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన భవన్స్‌ శ్రీ అరబిందో జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 16 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు ఇషాన్‌ శర్మ (78 నాటౌట్‌; 61 బంతుల్లో 11×4, 2×6), రాహుల్‌ (47 నాటౌట్‌) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. చూడముచ్చటైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ జోడీ ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా పని పూర్తి చేసింది. 

రాణించిన నవ్య, అంజలి: నవ్య (28), అంజలి (26 నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించడంతో మహిళల టైటిల్‌ పోరులో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జూనియర్‌ కళాశాల 76 పరుగుల తేడాతో కీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (సికింద్రాబాద్‌)ని ఓడించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ 15 ఓవర్లలో 2 వికెట్లకు 134 పరుగులు చేసింది. నవ్య, అంజలి బ్యాట్‌తో మెరిసి జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేదనలో కీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లకు 58 పరుగులే చేయగలిగింది. అక్షిత (1/11), శ్వేత (1/12), జ్యోతిర్మయి (1/6) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని అడ్డుకున్నారు. అంతకుముందు జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జట్టు 27 పరుగుల తేడాతో టీటీడబ్ల్యూఆర్‌ మహిళల డిగ్రీ కళాశాల (షాద్‌నగర్‌)పై గెలిచింది. టోర్నీ ముగింపు కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. నారాయణ విద్యాసంస్థల జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ ఆపరేషన్స్‌) రమేశ్‌బాబు, హైదరాబాద్‌ యూనిట్‌ మేనేజర్‌ రమేశ్‌బాబు, ఈవెంట్‌ మేనేజర్‌ సత్యబాబు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లు ట్రోఫీలతో పాటు రూ.5 వేలు, రన్నరప్‌ జట్లు రూ.2,500 నగదు బహుమతి సొంతం చేసుకున్నాయి.


 సీనియర్స్‌:  సర్దార్‌ పటేల్‌ కళాశాల: 201/4 (షేక్‌ సోహైల్‌ 94 నాటౌట్, అనిరుధ్‌ 63, సూర్యతేజ 2/30, భరత్‌ 2/32), భవన్స్‌ వివేకానంద డిగ్రీ కళాశాల: 115 (సూర్యతేజ 22, అనిరుధ్‌ 4/31, రతన్‌తేజ  3/14); జూనియర్స్‌: ఐ- క్లాస్‌ సీడీఆర్‌ జూనియర్‌ కళాశాల: 128/9 (ఆర్యన్‌ కరియప్ప 35, వెంకట్‌ కార్తీక్‌ 25, ఎస్కే ఆఖీబ్‌ 2/19, సాహిల్‌ కొల్రియ 2/36), భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్‌ కళాశాల: 133/0 (ఇషాన్‌ శర్మ 78 నాటౌట్, రాహుల్‌ 47 నాటౌట్‌); 

మహిళల ఫైనల్స్‌:  టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జూనియర్‌ కళాశాల: 134/2 (నవ్య 28, అంజలి 26 నాటౌట్, అఖిల 1/32), కీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ: 58/5 (అక్షిత 1/11, శ్వేత 1/12, జ్యోతిర్మయి 1/6);     ప్లేఆఫ్స్‌: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జూనియర్‌  కళాశాల:82/3 (అంజలి 33 నాటౌట్, మంజుల     1/17), టీటీడబ్ల్యూఆర్‌ మహిళల డిగ్రీ కళాశాల: 55/7 (శ్వేత 2/12)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.