
తాజా వార్తలు
ఒకట్రెండు కేసులకే ఆఫీసులు మూసేయొద్దు
కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. ఆర్థిక కార్యకలపాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా పలు కార్యాలయాలు తెరుచుకొనేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ/ ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఒకటి లేదా రెండు కేసులు వస్తే మొత్తం కార్యాలయాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయా కార్యాలయాలను శానిటైజేషన్ చేయాలని సూచించింది. ఒకవేళ భారీ సంఖ్యలో కేసులు నమోదైతే మాత్రం మొత్తం భవనాన్ని 48గంటల పాటు మూసివేయాలని ఆదేశించింది. ఆ కార్యాలయ భవనాలను శానిటైజ్ చేసి ఇక సిబ్బందిని అనుమతించవచ్చు అని చెప్పేవరకు అందరూ ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎవరైనా సిబ్బందిలో కరోనా లక్షణాలు కనబడితే వాళ్లు ఆఫీస్కు వెళ్లకుండా వైద్యుల్ని సంప్రదించేలా చూడాలంది. ఒకవేళ కరోనాగా అనుమానం ఉన్నా.. నిర్ధారణ అయినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం తెలపాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో హోం క్వారంటైన్లో ఉన్న సిబ్బంది అడిగితే వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. సమావేశాల నిర్వహణ, సందర్శకులను సమన్వయం చేయడం వంటి విషయాల్లో సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) మార్గదర్శకాలను చాలా జాగ్రత్తగా పాటించాలని సూచించింది. కార్యాలయాల్లో కారిడార్లు, ఎలివేటర్లు, మెట్లు, క్యాంటీన్, సమావేశ గదులు, కాన్ఫరెన్స్ హాళ్లలో దగ్గరగా మెలిగే అవకాశం ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా అనుమానిత కేసు ఉంటే సమర్థంగా స్పందించాలని సూచించింది.
ఒకరు కన్నా ఎక్కువమంది వ్యక్తులు ఒకే గది/ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు బయటపడితే.. ఆ వ్యక్తిని ఐసోలేషన్ చేయాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, మిగతా వాళ్లు మాస్క్లు ధరించేలా చూడటంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని హోం క్వారంటైన్ చేయాలని సూచించింది.