
తాజా వార్తలు
ఎవరికి వారే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు!
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన కిట్
వాషింగ్టన్: కరోనా కట్టడికి క్రమంగా అందుబాటులోకి వస్తున్న ఆయుధాల జాబితాతో మరో అస్త్రం చేరింది. ఎవరికి వారే ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునే కిట్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ‘అత్యవసర వినియోగం’ కింద అనుమతించింది. దీనిపేరు ‘లూసిరా కొవిడ్-19 ఆల్ ఇన్ వన్ కిట్’.
ఈ కిట్‌ను ఒకసారి వినియోగించొచ్చు. వైద్యుల సూచన మేరకే దీన్ని వాడాలి. మాలిక్యూలార్ యాంప్లిఫికేషన్ సాంకేతికత ద్వారా ఇది వైరస్‌ను గుర్తిస్తుంది. దాదాపు 30 నిమిషాల్లో ఫలితం తేలిపోతుంది. ఈ కిట్‌లో స్టెరైల్ స్వాబ్, నమూనాల్ని ఉంచే చిన్న సీసా (శాంపిల్ వయల్), టెస్ట్ యూనిట్, బ్యాటరీలు, వాడి పడేసే ప్లాస్టిక్ సంచి ఉంటాయి. తొలుత స్వాబ్‌తో గొంతు నుంచి నమూనాల్ని సేకరించాలి. అనంతరం దాన్ని నమూనాల్ని ఉంచే సీసాలో కొద్దిసేపు ఉంచి టెస్ట్ కిట్‌లో పెట్టాలి. కొంత సమయం తర్వాత కిట్‌లో ఉండే ఎల్ఈడీ ఇండికేటర్స్‌లో రంగు మారుతుంది. మారిన రంగును బట్టి వైరస్ సోకిందో లేదో నిర్ధారిస్తారు. దీన్ని ఎలా వినియోగించాలో ప్రిస్క్రిప్షన్‌కి ముందు వైద్యులు వివరించాల్సి ఉంటుంది.
యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అనేక మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అయితే, అసలు వైరస్ సోకిందో, లేదో తెలుసుకోవడమే పెద్ద సవాల్‌గా మారింది. దీంతో వైరస్ విపరీతంగా పాకిపోతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. అదే వైరస్ సోకినట్లు తొందరగా నిర్ధారించగలిగితే వెంటనే చికిత్స ప్రారంభించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మరింత మందికి సోకకుండా చూడొచ్చు. ఈ నేపథ్యంలో అమెరికాలో తాజాగా అందుబాటులోకి వచ్చిన లూసిరా కిట్ కీలకంగా మారనుంది.
10 నిమిషాల్లో ఫలితం..
మరోవైపు కరోనా సోకిందో లేదో పది నిమిషాల్లో తేల్చే టెస్ట్ కిట్లను జర్మనీకి చెందిన మల్టీ-జీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఐరోపా సహా ప్రధాన మార్కెట్లలో వీటిని పంపిణీ చేసేందుకు దేశీయ ఫార్మా కంపెనీ సిప్లా.. మల్టీ-జీతో ఒప్పందం కుదుర్చుకొంది. కొవి-జీ పేరిట వీటిని విక్రయించనున్నారు. రక్తంలో ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు ఆనవాళ్లను గుర్తించడం ద్వారా కరోనాను నిర్ధారిస్తారు. ఈ కిట్లు 92శాతం కచ్చితత్వంతో పనిచేస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఇవీ చదవండి..
ఫైజర్ టీకా కొందామా.. వద్దా..?
వ్యాక్సిన్ నిల్వకు మామూలు రిఫ్రిజిరేటర్ చాలు