close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన.. 290కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. ఆత్మగౌరవం, కళ్లు సినిమాలకు రచయితా నంది పురస్కారాలు అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆంగ్ల మాధ్యమానికి సహకరిస్తాం: చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రవేశపెట్టే ఆంగ్లమాధ్యమానికి తాము సహకరిస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంగ్లమాధ్యమంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తానెప్పుడూ ఆంగ్లమాధ్యమానికి వ్యతిరేకం కాదని.. తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే దాన్ని అమలు చేయాలని సూచించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వైకాపా.. ఇప్పుడు మాత్రం తామే ఆంగ్లమాధ్యమాన్ని కనుగొన్నట్లు మాట్లాడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మద్యంపై ఉద్యమం ఆగదు: లక్ష్మణ్‌

‘దిశ’ హత్య తర్వాత మద్యంపై సర్వత్రా చర్చ నడుస్తోందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్ అంటూ ట్వీట్‌ చేస్తున్న కేటీఆర్‌.. బ్రాందీ హైదరాబాద్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద మాజీ మంత్రి డీకే అరుణ చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాజపా మహిళా సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. మద్యంపై ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కాంగ్రెస్‌ వెనకాడింది..:మోదీ

భాజపా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందనే నమ్మకం దేశ ప్రజలందరికీ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఝార్ఖండ్‌లోని ధనాబాద్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ వెనకాడిందని.. కానీ, తమ ప్రభుత్వం అలా కాదని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ

‘దిశ’ అత్యాచారం కేసుకు సంబంధించి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సబంధించి విచారణ చేపట్టవద్దని సుప్రీం స్టే విధించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. అనంతరం విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మరోవైపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అడ్వకేట్‌జనరల్‌ను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత

అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్లను మిగతా కేసుల మాదిరిగా సాధారణ విధానాన్ని అనుసరించకుండా ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ చేశారు. తీర్పుపై సమీక్ష కోరుతూ దాఖలైన 18 రివ్యూ పిటిషన్లను సీజేఐ తిరస్కరించారు. రివ్యూ పిటిషన్లపై ఛాంబర్‌లో సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అంతర్గత విచారణ జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మోదీజీ మీ ట్వీట్‌ వాళ్లు చదవలేరు

పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్‌) గురించి మోదీజీ మీరు హామీ ఇస్తూ చేసిన ట్వీట్‌ను అసోం ప్రజలు చదవలేరంటూ కాంగ్రెస్‌ చురకలు వేసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ట్విటర్‌ వేదికగా ఆయన అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నిధుల కోసం ప్రజలకు డిన్నర్‌ పార్టీలు ఇవ్వండి

వచ్చే ఏడాది దిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరించేందుకు ప్రజలకు టీ, లంచ్‌, డిన్నర్‌ పార్టీలు ఇవ్వాల్సిందిగా ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ నేతలకు సూచించారు. ఆప్‌కి నిధులు సేకరించే విషయంపై జరిగిన సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌ అధ్యక్షత వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అజిత్‌ పవార్‌కు ఆర్థిక బాధ్యతలేనా?

మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ‘అధికార’ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దేవేంద్ర ఫడణవీస్‌ మూడు రోజుల ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌కు.. మహావికాస్‌ ఆఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలోనూ అదే పదవి దక్కనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దానిపై సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా ఆయనకు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మళ్లీ 12వేలకు చేరువలో నిఫ్టీ

వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో సాగాయి. ఆ సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు కూడా రాణించాయి. అటు లోహ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు కూడా సూచీలను ముందుకు నడిపించాయి. నేటి సెషన్‌లో 169 పాయింట్ల లాభంతో 40,582 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 11,972 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.60గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.