close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. గవర్నర్‌కు తెదేపా శాసనసభాపక్షం లేఖ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా శాసన సభాపక్షం లేఖ రాసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో ఆయన్ను కోరింది. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై దాడులు చేయండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ప్రోత్సహిస్తుంటే సభాపతి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై వాడీవేడి చర్చ

శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ... ‘‘అమరావతిలో సీఎం ఒక్క రోజు కూడా పర్యటించలేదు. దాదాపు అన్ని భవనాల నిర్మాణం పూర్తయింది. రాజధాని తరలిస్తే అమరావతిలో పెట్టిన ప్రజాధనం వృథా అవుతుంది. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని కేంద్రం చెబుతోంది. దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవు. మూడు రాజధానులతో ప్రజా ధనం వృథా అవుతుందని ఆదేశ అధ్యక్షుడే చెప్పారు’’ అని లోకేశ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. జగన్‌వి ఫ్యాక్షనిస్టు రాజకీయాలు: జేసీ

రాష్ట్రంలో రాక్షస పాలన, పోలీసుల రాజ్యం నడుస్తోందని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. ఫ్యాక్షనిస్టుల తరహాలో ఐపీఎస్‌ అధికారి లాఠీతో మహిళలను విచక్షణా రహితంగా కొట్టడం తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానని.. ఒక ఎస్పీ స్థాయి అధికారి అలా వ్యవహరించడం సరికాదని ఆక్షేపించారు. అనంతపురంలో జేసీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ ఫ్యాక్షనిస్టు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలనలో కీలకమైన సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించే ఏకపక్ష నిర్ణయాలను విడనాడాలని ఆయన హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. బడ్జెట్‌ రోజున మార్కెట్లు పనిచేస్తాయ్‌

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయని, ఆ రోజున ట్రేడింగ్‌ జరుగుతుందని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 శనివారం. సాధారణంగా శని, ఆదివారాల్లో మార్కెట్లకు సెలవు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా మార్కెట్లు సెలవు దినాల్లో పనిచేయవు. అయితే బడ్జెట్ నేపథ్యంలో ఈ సారి శనివారం కూడా ట్రేడింగ్‌ నిర్వహించనున్నట్లు బీఎస్‌ఈ ఓ సర్క్యులర్‌లో తెలిపింది. సాధారణ రోజు మాదిరిగానే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సెషన్‌ కొనసాగుతుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టులో విచారణ

మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు, హైకోర్టు తరలింపు అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. తరలింపును ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మండలిలో చర్చ జరుగుతోందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) వివరణ ఇచ్చారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మారుతీ.. 5లక్షల బీఎస్‌6 వాహనాల విక్రయం

కాలుష్య నివారణపై చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ఇంజిన్‌ ఉన్న వాహనాలను మాత్రమే విక్రయించేలా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే తాము 5 లక్షల యూనిట్ల బీఎస్‌-6 వాహనాలను విక్రయించినట్లు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్రస్తుతం బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌తో 10 మోడళ్లను విక్రయిస్తున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. నా అనే పదం మా డిక్షనరీలోనే లేదు!

భారత జట్టు డిక్షనరీలో ‘నా’ అనే పదం లేదని, సహచరుల విజయాల్ని ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా గురించి రవిశాస్త్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘మా సమీకరణాల నుంచి టాస్‌ను తీసేశాం. ప్రపంచంలో ఎక్కడైనా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకుంటున్నాం. ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాం. మా డిక్షనరీలో ‘నా’ అనే పదం లేదు. ‘మా’ అని మాత్రమే ఉంటుంది’’ అని రవిశాస్త్రి తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. బీటా యూజర్లకు వాట్సాప్‌ డార్క్‌మోడ్‌

వాట్సాప్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డార్క్‌మోడ్‌ ఫీచర్‌ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. అయితే, కేవలం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లు మాత్రమే ఈ ఫీచర్‌ను వినియోగించుకోగలరు. సాధారణ యూజర్లకు ఈ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నిత్యానందపై ఇంటర్‌పోల్‌ నోటీసు

వివాదాస్పద గురువు నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గుజరాత్‌ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. వారి అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద గతేడాది భారత్‌ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానందకు చెందిన ఆశ్రమంలో అమ్మాయిలను అక్రమంగా నిర్బంధించి వారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు గతేడాది అతడిపై కర్ణాటకలో కేసు నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10.మార్కెట్లను మూడో రోజూ వదలని నష్టాలు

వరుసగా మూడో రోజు దేశీయ సూచీలు నష్టపోయాయి. ట్రేడింగ్‌ ఆరంభం లాభాలతో మొదలైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అప్పటి నుంచి ఏ సమయంలోను మార్కెట్లు కోలుకోలేదు. చివరికి నష్టాలతోనే ముగిశాయి. ఐటీ రంగం మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ నష్టాల బాటలోనే కొనసాగాయి.  సెన్సెక్స్‌ 208.43 పాయింట్లు నష్టపోయి 41,115.38 వద్ద ముగియగా.. నిఫ్టీ 62.95 పాయింట్లు దిగజారి 12,106.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.22 వద్ద కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.