close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. కోహ్లీసేన సూపర్‌ ఓవరో‘హిట్‌’

న్యూజిలాండ్‌పై మూడో టీ20లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ సమం చేసింది. దాంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో కివీస్‌ 17 పరుగులు చేసింది. ఉత్కంఠ రేపిన సూపర్‌ ఓవర్‌ ఛేదనలో ఆఖరి రెండు బంతుల్ని రోహిత్‌ శర్మ భారీ సిక్సర్లుగా మలిచి విజయం అందించాడు. దీంతో భారత్‌ మరో రెండు మ్యాచులు ఉండగానే 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. విశాఖ ఏమైనా కొట్టుకుపోతుందా?: బొత్స

ఒక అంశంపై నిర్దిష్టంగా తమ విధానం ఇదీ అని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పిన సందర్భం ఎప్పుడూ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయాల కోసం మాట మార్చడం ఆయన నైజమని.. అందుకే ఆయన్ను యూటర్న్‌ బాబు అన్నారని ఎద్దేవా చేశారు. ‘‘తుపాన్లు వస్తే మాత్రం విశాఖ ఏమైనా కొట్టుకుపోతుందా? తుపాన్లతో విశాఖకు పెద్దగా నష్టం ఉండదు. అమరావతికీ వరద ముప్పు ఉంది. దానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది’’ అని బొత్స వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అబార్షన్‌ గడువు పెంపునకు కేబినెట్‌ ఆమోదం

గర్భ విచ్ఛిత్తి (అబార్షన్‌) గడువును పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20 వారాలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి 1971 నాటి చట్టానికి సవరణ చేస్తూ గర్భవిచ్ఛిత్తి (సవరణ) బిల్లు 2020ను త్వరలో జరగబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కరోనాపై అసత్య ప్రచారాలు వద్దు:ఈటల

రాష్ట్రంలో కరోనా వైరస్‌పై వస్తున్న అసత్య ప్రచారాలతో ప్రజలు భయపడొద్దని.. స్వైన్‌ఫ్లూ సమయంలో తీసుకున్నట్లుగానే అన్ని విధాలుగా మందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ముందుస్తు చర్యలపై అధికారులతో సమాలోచనలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. తీరానికి దూరంగా ఉంచాలని చెప్పాం:జీఎన్‌ రావు

ఏపీలో సమర్ధవంతమైన పాలన అందించేందుకు రాష్ట్రాన్ని నాలుగు జోన్లగా విభజించాలని సిఫార్సు చేశామని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు తెలిపారు. రాజధానిని సముద్రతీరానికి దూరంగా ఉంచాలని.. సుమారు 50 కి.మీ దూరంలో పరిపాలన భవనాలను ఏర్పాటు చేయాలని తమ నివేదికలో సూచించామని స్పష్టం చేశారు. విశాఖకు తుపాన్లు ముప్పు ఉంటుందని జీఎన్‌ రావు కమిటీ నివేదికలో హెచ్చరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజినీర్లు

చైనాలోని కరోనా వైరస్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకూ తాకింది. చైనాలోని వుహాన్‌ నగరంలో తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు చిక్కుకుపోయారు. ప్రాంగణ నియామకాల ద్వారా శ్రీసిటీలోని టీసీఎల్‌ కంపెనీకి ఎంపికైన వీరంతా..శిక్షణ నిమిత్తం వుహాన్‌కు వెళ్లారు. సదరు సంస్థ మొత్తం 96 మందిని 3 నెలల శిక్షణకోసం చైనాకు పంపించింది. ఆగస్టు 2019లో చైనా వెళ్లిన వారిలో 38 మంది నవంబర్‌లోనే తిరిగివచ్చారు. మిగిలిన 58 మంది వుహాన్‌లోని కంపెనీ హాస్టల్‌లోనే ఉండిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఒక్కరోజే రూ. 1000 తగ్గిన వెండి

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. బుధవారం ఒక్కరోజే వెండి ధర ఏకంగా రూ. 1,083 తగ్గింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ ధర రూ. 46,610గా ఉంది. అటు పసిడి కూడా దిగొచ్చింది. రూ. 182 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 41,019 పలికింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. భాజపా ఎంపీలపై ఈసీ వేటు

ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, భాజపా ఎంపీ పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. వీరిద్దరిని భాజపా తక్షణమే తమ ప్రచారతారల జాబితా నుంచి తొలగించాలని ఈసీ ఆదేశించింది. ఇటీవల దిల్లీ రితాలా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో అనురాగ్‌ ఠాకూర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను విమర్శిస్తూ వారిని ‘దేశద్రోహులు’ అని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఫ్యాన్సీ నంబర్ల కోసం సరికొత్త విధానం:పువ్వాడ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తారని.. త్వరలో కొత్త నినాదాలు, సీఎం కేసీఆర్ చిత్రపటాలతో ప్రచారం చేపడతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవలను ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభిస్తామని.. ఇప్పటికే 50 కార్గో బస్సులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. వాహనదారులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నంబర్ల కోసం అధికారులు, రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ-బిడ్డింగ్ ద్వారా పొందేందుకు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. చైనా కరోనా వైరస్‌ ప్రభావంతో గత రెండు రోజులుగా డీలా పడిన మార్కెట్లు బుధవారం మళ్లీ పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 231 పాయింట్లు లాభపడి.. 41,198 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 12,129 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.24 వద్ద కొనసాగుతోంది. బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు ఉందన్న సంకేతాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.