
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. హెచ్-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేస్తా: బిడెన్
తాను అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే.. హెచ్-1బీ వీసాల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని అమెరికా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు వీలుగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. టిక్‌టాక్‌కు రూ.45వేల కోట్ల నష్టం..!
యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైనా విలవిల్లాడుతోంది. మింగలేక కక్కలేక బాధపడుతోంది. డబ్లూటీసీ నియమాలకు విరుద్ధమని డొల్ల మాటలు చెబుతోంది. అయితే, యాప్‌ల నిషేధంతో డ్రాగన్ కంపెనీలపై దెబ్బ బాగానే పడిందని తెలిసింది. నిషేధం వల్ల టిక్‌టాక్, హెలో యాప్‌ల మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్ డాలర్లు) నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అన్నింటిలోనూ అవినీతే: చంద్రబాబు
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మేలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘లాక్డౌన్ పెట్టిన తర్వాత ఏపీకి రూ.8వేల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆనిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.5వేలు చొప్పున ఇవ్వాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కరోనా కిట్లు, బ్లీచింగ్ కొనుగోలులో అవీనితికి పాల్పడ్డారు’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మయన్మార్‌లో ఘోరం: 110మందికి పైగా మృతి
మయన్మార్‌లోని కాచిన్ రాష్ట్రంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. జాడె అనే ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి 113 మంది కార్మికులు మృతిచెందారు. వందలాది మంది గనుల్లో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఏపీలో మరో 845 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14,285 మంది నమూనాలు పరీక్షించగా 845 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 29 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 812 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,907 కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఈపీఎఫ్ ఖాతా బదిలీతో పన్ను మినహాయింపు
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. ఆ సమయంలో డబ్బులేకపోవడంతో చాలామంది ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ నుంచి 55లక్షలకు పైగా చందాదారులు రూ.15,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే, ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందో రాదో చూసుకోవడం ముఖ్యమని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. భారత వ్యతిరేక చైనా చర్యను అడ్డుకున్న జర్మనీ, యూఎస్
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోనూ దుందుడుకు చైనాకు చుక్కెదురైంది! అమెరికా, జర్మనీ ఆ దేశంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఊహించని విధంగా భారత్‌కు నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆ నిర్ణయం చైనా మీద ‘డిజిటల్ దాడి’ వంటిదే
చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డిజిటల్ దాడి’గా అభివర్ణించారు. భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశానికి చెందిన 21 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్..చైనాకు చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. దానిలో భాగంగానే యాప్‌లపై నిషేధం విధిస్తూ ప్రకటన చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. త్వరలో వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు
త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్, వెబ్ మోడ్లలో ఇవి రానున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ మెసేజింగ్ దిగ్గజం యానిమేటెడ్ స్టిక్కర్లను, వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్ వీడియో కాల్స్ సౌకర్యానికి మెరుగులు దిద్దింది. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ క్లైంట్లకు డార్క్‌మోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఆ వార్తలు అవాస్తవం: వరవరరావు అల్లుడు
భీమా కోరేగావ్ కేసులో అరెస్టయి తలోజా జైలులో ఉన్న విరసం నేత వరవరరావు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. జైలులో ఉన్న వరవరరావు ఈ రోజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారని వరవరరావు అల్లుడు వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరవరరావు ఆరోగ్యంపై జైలు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. జైలు అధికారుల నుంచి సమాచారం వచ్చినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని వేణుగోపాల్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి